హామీ మేరకు తక్షణమే రుణమాఫీ చేయాలి

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇకనైనా మొద్దు నిద్ర వీడి వర్షాలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజానీకాన్ని ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. వర్షాలవల్ల పంట నష్టపోయి రాష్ట్ర రైతాంగం ఇబ్బంది పడుతోందని చెబుతూ,  గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ హామీ నెరవేరకపోవడంతో బ్యాంకులు కొత్తగా రుణాలివ్వడం లేదని తెలిపారు.

గతంలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని అమలు చేయడంతో పాటు తక్షణమే బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి కొత్తగా రుణాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో గత మూడు, నాలుగు రోజుల నుండి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో విపత్కర పరిస్థితుల్లో ప్రజలున్నారని చెబుతూ  బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. గతంలో ఇలాంటి అనేక  సందర్భాల్లో బీజేపీ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి సేవ చేశారని గుర్తు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్ మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని,  ఫాంహౌజ్, ప్రగతి భవన్ వీడి బయటకు రావడం లేదని ధ్వజమెత్తారు. కరోనా సమయంలో, హైదరాబాద్ లో వరదలొచ్చినప్పుడు కూడా బయటకు రాలేదని గుర్తు చేశారు. భారీ వర్షాలతో ఆదిలాబాద్ లో 40 వేల ఎకరాల పంట నీట మునిగిందని, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు.

రాష్ట్ర రైతాంగానికి దాదాపు రూ 8 వేల కోట్ల మేరకు పంట రుణాలు ఇవ్వలేదని, 2018లో రుణహామీ  చేస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు.  రైతులకు కొత్త రుణాలు ఇవ్వక పోగా, రైతులు సొంతంగా జమ చేసుకున్న డబ్బులను కూడా బ్యాంకు అధికారులు రుణమాఫీ జమ చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతులకు కేసీఆర్ ఏటా ఎకరాకు ఇచ్చేది రూ.10 వేలు మాత్రమే ఇస్తూ  ‘రైతు బంధు’ పేరుతో అన్ని సబ్సిడీలు బంద్ చేశారని, అయితే కేంద్ర ప్రభుత్వం యూరియా, డీఏపీ సబ్సిడీలతో రెండు పంటలకు కలిసి ఏటా  ఎకరానికి రూ.27 వేలు సబ్సిడీ ఇస్తోందని సంజయ్ చెప్పార

3వ విడత పాదయాత్ర ప్రారంభం రోజే  కాంగ్రెస్ సిరిసిల్లలో సభ నిర్వహించడంపై ప్రస్తావిస్తూ  ‘‘కాంగ్రెస్ పార్టీ అయోమయంలో ఉంది. మేం అధికార టీఆర్ఎస్ తో కొట్లాడుతున్నం. ప్రజల పక్షాన ఉద్యమలు చేస్తుంటే… మాకు పోటీగా కాంగ్రెస్ కార్యక్రమాలు చేస్తోంది. కాంగ్రెస్ గ్రాఫ్ పెంచడానికి కేసీఆర్ కష్టపడుతున్నాడు” అంటూ ఎద్దేవా చేశారు.

ఎందుకంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఆరోపించారు.  రాష్ట్రపతి ఎన్నికల్లో కలిసి అభ్యర్ధిని నిలబెట్టాయని గుర్తు చేశారు.  బీజేపీని అణిచివేసేందుకు టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా సహకరిస్తోందని అంటూ ఆ రెండు పార్టీలు సహా ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేసినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరని స్పష్టం చేశారు.