తెలంగాణలో మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు

తెలంగాణాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వానలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని, జనజీవనానికి ఆటంకాలు తగ్గించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ముందస్తు చర్యల్లో భాగంగా సోమ, మంగళ, బుధ వారాలు మూడు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
 
రాష్ట్రంలో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఆసిఫాబాద్ కొమరం భీమ్ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అత్యంత ఎక్కువగా పడే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల కరీంనగర్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ అర్బన్, రూరర్, జనగామలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 
 
ఈ  జిల్లాలలో ఆరంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ నగరంలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది .ఆదివారం సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. భారీ వానల నేపథ్యంలో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, డ్యాంలు, రిజర్వాయర్లలోని నీటి పరిస్థితి గురించి ఈ సందర్భంగా ఆరా తీశారు.
 
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మళ్లీ వర్షం మొదలైంది. నాలుగవ రోజు సైతం నగరాన్ని ముసురు వదల్లేదు. గ్రేటర్ వ్యాప్తంగా మళ్లీ వర్షం మొదలైంది. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. సిటీలో అత్యధికంగా రాజేంద్రనగర్ లో 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుత్బుల్లాపూర్ లో 3.6, బహదూర్ పురా లో 3.5, శేరిలింగంపల్లిలో 3.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
 
భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహిస్తోంది. నీటిమట్టం 49.40 అడుగులకు చేరింది. భద్రాచలం దగ్గర నీటి ప్రవాహం 12,17,862 క్యూసెక్కులకు చేరింది. పూర్తిగా స్నానఘట్టాలు, కళ్యాణకట్ట నీట మునిగాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో అధికారులు 9 వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండడంతో అధికారులు ఐదు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.