ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. పోలవరం వద్ద 48 గేట్లు ఎత్తివేత

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పోలవరం వద్ద ఉగ్రరూపం దాలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తుండడంతో కొవ్వాడ, ఇసుక కాల్వ  పోటెత్తుతున్నాయి. ఈ రెండూ గోదావరిలో పట్టిసీమ వద్ద కలుస్తాయి. భారీగా వరద నీరు రావడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం పెరిగింది.
దీంతో 48 గేట్లు ఎత్తివేసి దిగువకు వదులుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద శనివారం 28.640 మీటర్లు, దిగువ కాఫర్‌ డ్యాం వద్ద 18.505 మీటర్లు ఉన్న నీటి మట్టం అనూహ్యంగా పెరిగి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు 29.660 మీటర్లు,దిగువ కాఫర్‌ డ్యాం వద్ద 19.050 మీటర్లకి చేరింది. సిడబ్ల్యుసి వద్ద 19.357 అడుగుల నీటిమట్టం నమోదైంది.
దాంతో. అధికారులు ప్రాజేక్టు 48 గేట్ల నుండి గంటకు లక్ష 98 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో పోలవరం, పట్టిసీమ, దిగువన గోదావరి ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. .భద్రాచలం వద్ద సాయంత్రం 36 అడుగుల మేర నీటిమట్టం నమోదైంది. వరద ప్రమాదం దృష్ట్యా ఇప్పటికే 19 గిరిజన గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు.
 
 ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 6.20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు బ్యారేజీ 175 గేట్లు స్వల్పంగా ఎత్తివేసి 3 లక్షల 22 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేశారు. వరద నీటి ప్రవాహంతో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలకు వేసిన తాత్కాలిక రోడ్లు కొట్టుకపోయాయి. దీంతో ప్రజలు నాటుపడవలపైనే ప్రయాణం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. 
 
మరోవంక,  ప్రకాశం బ్యారేజ్‌‌ కు వరద ఉధృతి కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు వైరా కటల్లేరుల్లో వరద ప్రవాహం పెరుగుతోంది. మున్నేరు నుంచి కీసర వద్ద కృష్ణ నదిలోకి 38 వేల 800 వందల  క్యూసెక్యుల వరద నీరు వచ్చి చేరుతోంది.
దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటి మట్టం నిల్వ చేస్తూ అదనపు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌ 45 గేట్లు అడుగు మేర ఎత్తి 34,000 క్యూసెక్యుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. త్రాగు, సాగు నీటి అవసరాల కోసం కృష్ణా, ఈస్ట్రన్‌ అండ్‌ వెస్ట్రన్‌ కాలువలకు 4,800 క్యూసెక్యుల నీటి విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు.