దలైలామాకు ప్రధాని శుభాకాంక్షలపై చైనా విమర్శలను తిప్పి కొట్టిన భారత్ 

టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెప్పడంపై చైనా విమర్శలు గుప్పించడంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఘాటుగా సమాధానం చెప్పింది. దలైలామా భారత దేశానికి అతిథి అని, ఆయనను తాము ఎంతో గౌరవిస్తామని స్పష్టం చేసింది.
దలైలామా 87వ జన్మదినోత్సవాలు బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘పూజనీయులైన దలైలామాకు 87వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపాను. ఈరోజు ఉదయం ఆయనతో టెలిఫోన్ ద్వారా మాట్లాడాను. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించాను’’ అని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మీడియాతో మాట్లాడుతూ, 14వ దలైలామా చైనా వ్యతిరేక వేర్పాటువాద స్వభావాన్ని భారత దేశం సంపూర్ణంగా గుర్తించాలని హితవు చెప్పారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి టిబెట్ సంబంధిత అంశాలను ఉపయోగించుకోవడాన్ని భారత దేశం మానుకోవాలని సూచించారు.
దలైలామాకు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్‌ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీంతో అమెరికాపై కూడా ఝావో లిజియాన్ మండిపడ్డారు.  చైనా విమర్శలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందిస్తూ, దలైలామాతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది కూడా మాట్లాడారని చెప్పారు.
భారత దేశానికి దలైలామా అతిథి అని, ఆయనను ఆ విధంగా పరిగణించడం భారత ప్రభుత్వ  స్థిర విధానమని స్పష్టం చేశారు. దేశంలో ఆయనను అనుసరించేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు. ఆయన పుట్టిన రోజును భారత దేశంతో పాటు విదేశాల్లో కూడా జరుపుకుంటారని గుర్తు చేశారు.
జర్మనీ విమర్శలకూ ధీటైన సమాధానం
మరోవంక జర్మనీ విమర్శలకు కూడా భారత్‌ ధీటైన సమాధానం ఇచ్చింది. ప్రముఖ ఫ్యాక్ట్‌చెకర్‌ ముహమ్మద్‌ జుబేర్‌ అరెస్ట్‌ వ్యవహారంపై జర్మనీ విదేశాంగ శాఖ  భారత ప్రభుత్వ తీరును తప్పుబట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

“ఉచిత రిపోర్టింగ్ ఏ సమాజానికైనా ప్రయోజనకారిగా ఉంటుంది. వాళ్లపై పరిమితులు ఆందోళన కలిగిస్తాయి. జర్నలిస్టులు ఏం మాట్లాడినా  రాసినా వారిపై వేధింపులకు పాల్పడడం, నిర్భంధించడం లాంటివి చేయకూడదు. ఈ నిర్దిష్ట కేసు(జుబైర్‌ అరెస్ట్‌ను ప్రస్తావిస్తూ..) గురించి మాకు నిజంగా తెలుసు. న్యూఢిల్లీలోని మా(జర్మనీ) రాయబార కార్యాలయం దీన్ని చాలా నిశితంగా పరిశీలిస్తోంది” అని జర్మనీ విదేశాంగ మంత్రిత్వ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.

‘‘ఇది మా అంతర్గత వ్యవహారం. ప్రస్తుతం ఈ విషయం న్యాయ స్థానంలో ఉంది. మా న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పని చేస్తుంది. అలాంటి వ్యవస్థపై మీ కామెంట్లు సరికాదు. ప్రస్తుతానికి మీకనవసరం’’ అంటూ విదేశాంగ కార్యదర్శి అరిందమ్‌ బాగ్చి ధీటుగా బదులిచ్చారు.

ఇదిలా ఉంటే పత్రికా స్వేచ్ఛా, భావ స్వేచ్ఛ ప్రకటన అంశాల ఆధారంగా యూరోపియన్‌ యూనియన్‌ తరపున మానవ హక్కుల సంఘం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ ప్రకటించుకుంటుంది. అలాంటప్పుడు.. ప్రజాస్వామ్య విలువలైన ప్రతికా స్వేచ్ఛ, భావ ప్రకటనలకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ జర్మనీ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే భారత్‌ తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది.

ఆల్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ సహవ్యవస్థాపకుడైన జుబేర్‌ను.. జూన్‌ 27వ తేదీన ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2018లో చేసిన ఓ ట్వీట్‌ ఆధారంగా అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. ఫారిన్‌ కాంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ కింద పలు ఆరోపణలపై 14 రోజుల క్టసడీకి తీసుకున్నారు.