మహారాష్ట్ర అసెంబ్లీలోరేపే  బలపరీక్ష.. గవర్నర్ ఆదేశం 

మహారాష్ట్రలో పది రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం చివరకు ముగింపు దశకు చేరుకొంది. శివసేన పార్టీలో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో గురువారం (రేపు) మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశించారు.
గురువారం సాయంత్రం 5 గంటల లోగా సభలో మెజారిటీ నిరూపించుకోవాలని ఉద్ధవ్ ఠాక్రేను మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ గత రాత్రి ఆదేశాలు జారీ చేశారు.ఈ అసెంబ్లీ సమావేశాన్ని వీడియోలో రికార్డ్ చేయాలని గవర్నర్ ఆదేశించారు. గురువారం ఉదయం 11 గంటలకు సమావేశమయ్యే ఏకైక అజెండా ఫ్లోర్ టెస్ట్ అని గవర్నర్ పేర్కొన్నారు.
‘‘రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ దృశ్యం చాలా కలవరపెడుతోంది. 39 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర వికాస్ అఘాడి ప్రభుత్వం నుంచి వైదొలగాలని ఆకాంక్షించారు. ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. ప్రతిపక్ష నాయకుడు కూడా కలుసుకున్నారు… ప్రస్తుతం ఉన్న పరిస్థితిని నాకు వివరించి, ఫ్లోర్ టెస్ట్ కోసం అడిగారు’’ అని గవర్నర్ కోష్యారి వివరించారు.
మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఢిల్లీలో కేంద్ర నాయకులు అమిత్ షా, జెపి నడ్డాలతో సమాలోచనలు జరిపిన తర్వాత గత రాత్రి ముంబైకి తిరిగి వచ్చారు. ఆయన నేరుగా గవర్నర్ ను కలసి ఉద్దవ్‌ థాక్రే ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని నివేదించారు. బలపరీక్షకు ఆదేశింపమని కోరారు.
ఇదిలా ఉండగా బలనిరూపణ నేపథ్యంలో తమ బృందం గురువారం ముంబైకి చేరుకోనున్నట్లు షిండే  ప్రకటించారు.  బలనిరూపణ తర్వాతే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.