నేతలపై కేసుల ఉపసంహరణకు హైకోర్టు అనుమతి తప్పనిసరి 

ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణకు  హైకోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేస్తూ  హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎలా తొలగించారని ధర్మాసనం ప్రశ్నించింది. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కేసుల ఉపసంహరణను సవాల్‌ చేస్తూ హైకోర్టులో ఏపీజేఎఫ్‌ అధ్యక్షుడు చెవులు కృష్ణాంజనేయులు పిటిషన్‌ వేశారు.

 న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్‌ పిటిషన్‌పై వాదనలు వినిపించారు. పీపీతో సంబంధం లేకుండా డీజీపీ, కలెక్టర్‌ ఆదేశాలతో.. కేసులు ఎలా తొలగిస్తారని న్యాయవాది ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేసులు తొలగించాలంటే.. హైకోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉందని శ్రవణ్‌కుమార్‌ పేర్కొన్నారు. 

హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎలా తొలగించారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఎన్ని కేసుల తొలగింపునకు హైకోర్టు అనుమతి తీసుకున్నారని ప్రశ్నించింది. ఎన్ని ఉపసంహరించారన్న దానిపై అఫిడవిట్‌ వేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

ఓటర్లకు డబ్బుల పంపిణీ, అధికారులపై దాడుల కేసులు కూడా  తొలగించారని ధర్మాసనం దృష్టికి శ్రవణ్‌కుమార్‌ తీసుకొచ్చారు. ప్రభుత్వం అఫిడవిట్‌ వేయకుంటే కేసులో ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు విచారణను ఎపి హైకోర్టు వాయిదా వేసింది.