సికింద్రాబాద్ అల్లర్ల కేసులో మారిన సూత్రధారి… సుబ్బారావు లేరా!

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  అల్లర్ల కేసు దర్యాప్తు రోజుకొక్క మలుపు తిరుగుతుంది. ఈ మొత్తం విధ్వంసానికి సూత్రధారిగా సాయి డిఫెన్స్ అకాడమీ ఛైర్మన్ ఆవుల సుబ్బారావును పేర్కొంటూ వచ్చారు.  ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు కూడా.
అయితే ఇప్పటి వరకు రైల్వే పోలీసులు గాని, తెలంగాణ పోలీసులు గాని అతనిని విచారించే ప్రయత్నం చేయలేదు. మరోవంక, పోలీసులు రిమాండ్ రిపోర్టులో అల్లర్లకు కామారెడ్డి వాసి మధుసూదన్ ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు.  ఈ కేసులో ఎ1గా కామారెడ్డి వాసి మధుసూదన్ పలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి 17వ తేదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు పెట్రోల్ బాటిళ్లు, కర్రలతో చేరుకుని విధ్వంసానికి కుట్ర పన్నినట్లు విచారణలో తేలిందని రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు.
ఈ రిపోర్ట్ లో ఎక్కడా సుబ్బారావు పేర్లు లేకపోవడం గమనార్హం. పోలీసుల అదుపులో ఉన్న సుబ్బారావును తెలంగాణ పోలీసులు ఎందుకు ప్రశ్నించలేదని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడులకు పాల్పడినవారు సాయి అకాడమీకి చెందిన వారుగా గుర్తించారు. 
 
వాట్సాప్‌ చాటింగ్‌, గ్రూప్స్, కాల్ రికార్డింగ్స్‌లో.. సుబ్బారావు పాత్రపై ఆధారాలున్నా ఎందుకు వదిలేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళన చేసిన కొంతమంది యువకులపై పోలీసులు కేసులు పెట్టి జైలుకి పంపించారు. కాగా, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్  అల్లర్ల కేసును రైల్వే పోలీసులు సిట్‌కు బదిలీ చేశారు.
ఆవుల సుబ్బారావు విషయంలో తెలుగు రాష్ట్రాల పోలీసుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ పోలీసులు ఇప్పటివరకు సంప్రదించలేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు. అయితే సుబ్బారావు పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని తెలంగాణ పోలీసులు అంటున్నారు.  ఈ అల్లర్లలో 16 ప్రైవేట్‌ కోచింగ్ సెంటర్ల పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరులోని పలు కోచింగ్‌ సెంటర్లపై పోలీసుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
డిఫెన్స్ అకాడమీలకు చెందిన కొంతమంది నిర్వాహకులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు నిర్ధారణకు వచ్చామని, ఈ విధ్వంసం వల్ల రూ.20 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఏ ఆర్మీ కోచింగ్‌ సెంటర్‌ పేరు కూడా రిపోర్టులో లేకపోవడం విస్మయం కలిగిస్తుంది.
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన విధ్వంసానికి ఆర్మీ అభ్యర్థులను ప్రేరేపించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీలోని నరసరావుపేటలోని సాయి డిఫెన్స్‌ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావుపై ఆదాయపన్ను శాఖ గురి పెట్టింది.
 సోమవారం సాయి డిఫెన్స్‌ అకాడమీలో ఐటీ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి 9 వరకు తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థుల వివరాలను కూడా సేకరించారు.  అకాడమీలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగుల కూడా విచారించారు. ఆవుల సుబ్బారావు ఇంకా నరసరావుపేట పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అయితే పోలీసులు మాత్రం అతడు తమ అదుపులో ఉన్నట్టు ధ్రువీకరించడం లేదు.
 కేంద్ర నిఘా సంస్థల గురి!

మరోవంక, ‘అగ్నిపథ్‌’ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసంపై కేంద్ర నిఘా సంస్థలు గురిపెట్టాయి. ఈ విధ్వంసం వెనుక బాధ్యులెవరు? ఆందోళనలో ఎవరెవరు పాల్గొన్నారు? రాజకీయ పార్టీల ఆరోపణలేంటి? ఎవరెవరు అరెస్టయ్యారు? నిర్దిష్ట కారణాలేంటి? ఘటనలో జాతి వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందా? అనే పలు కోణాల్లో లోతుగా దర్యాప్తు చేపడుతున్నాయి.

ఈ విధ్వంసానికి నిర్దిష్ట కారణాలను తెలుసుకోవడంతో పాటు ఇందుకు బాధ్యులు, ఆందోళనలో పాల్గన్నవారిని గుర్తించేందుకు కేంద్ర నిఘా సంస్థతో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నిఘా విభాగాలు రంగంలోకి దిగాయి. ఘటనపై రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండటంతో వాటిపైనా కేంద్ర నిఘా సంస్థ ఆరా తీస్తోంది. 

మరోవైపు… పోలీసులు, రైల్వేశాఖ ప్రతినిధులు సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని నిఘా విభాగానికి చెందిన ప్రతినిధులు న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం. 

ఆందోళనకారులను గుర్తించడానికి వీలుగా అరెస్టయిన వారి వివరాలు, దర్యాప్తు సందర్భంగా వారు వెల్లడించిన అంశాలతోపాటు.. సీసీ కెమెరా దఅశ్యాలు, వివిధ మీడియాల్లో ప్రచురితమైన ఫొటోలు, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన దఅశ్యాలను నిఘా విభాగం ప్రతినిధులు సేకరించే పనిలోపడ్డారు.