ప్రధాని బహిరంగ సభకు 10 లక్షల మందిని తరలివచ్చేలా ఏర్పాట్లు

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల (ఎన్ఈసీ) నేపథ్యంలో వచ్చే నెల 3న హైదరాబాద్ లో నిర్వహించబోయే బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ప్రజలను తరలించే విధంగా సన్నాహాలు చేయాలని బిజెపి తెలంగాణ నేతలు నిర్ణయించారు.
 
 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సహా పార్టీకి చెందిన అతిరథ మహారథులంతా ఈ బహిరంగ సభకు హాజరై దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, కనీవినీ ఎరగని రీతిలో సక్సెస్ చేసి నూతన చరిత్ర సృష్టించాలని నిర్ణయించారు. 
 
జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు రోజున సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభను ఏర్పాటు చేయాలని సంకల్పించిన కమలనాథులు సక్సెస్‌ చేసేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.  జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లు, చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేతలకు అప్పగించిన బాధ్యతలు తదితర అంశాలపై ఆదివారం కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.
 
 అదే విధంగా పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగసభ ఏర్పాట్లపై కూడా చర్చించారు. ఒకటి రెండు రోజులలో కేంద్ర రక్షణ శాఖ అధికారుల నుంచి గ్రౌండ్‌ క్లియరెన్స్‌ అనుమతులు రాగానే వేదిక ఏర్పాట్లతో పాటు పార్కింగ్‌ తదితర సౌకర్యాలపై రాష్ట్ర అధికారులతో చర్చించాలని నిర్ణయించారు.
 
మరోవంక, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సన్నాహక కమిటీ ఛైర్మన్ డాక్టర్ కె.లక్ష్మణ్, కమిటీ జాతీయ ఇంఛార్జీ అరవింద్ మీనన్ రోజంతా సమీక్షలు నిర్వహించారు.
 
ఎన్ఈసీ నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీలతో భేటీ అయ్యారు. అనంతరం స్థానికేతర నాయకులతో నూతనంగా నియమించిన అసెంబ్లీ ప్రభారీ (ఇంఛార్జీ)లతో కూడా సమావేశమయ్యారు.  ఈ సమాచారాన్ని రాష్ట్రంలోని ప్రతి గడప గడపకూ తెలియజేయాలని,  ప్రతి ఇంటికీ వెళ్లి బహిరంగ సభకు సంబంధించి ఆహ్వాన పత్రికను అందజేయాలని సంజయ్ కోరారు.
అందుకోసం 50 లక్షల ఆహ్వాన పత్రికలను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ బూత్ నుండి కనీసం 30 మంది చొప్పున, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సగటున 10 వేలకు తగ్గకుండా ప్రజలు సభకు హజరయ్యేలా చూడాలని చెప్పారు.  ఈనెల 22న అసెంబ్లీ ప్రభారీలంతా తమకు అప్పగించిన నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లి స్థానిక నేతలతో సమావేశమై జన సమీకరణతో పాటు స్థానికంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను సన్నద్ధం చేయాలని కోరారు.
మోదీ  సభ ద్వారా తెలంగాణ పట్ల పార్టీ వైఖరిని స్పష్టం చేయడంతో పాటు అధికారాన్ని అప్పగిస్తే చేసే అభివృద్ధిపై కూడా ప్రజలకు ఒక అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తెలంగాణకు కేటాయించిన నిధులు, ఇచ్చిన ప్రాధాన్యతను సభ ద్వారా మరోసారి ప్రజల ముందుంచనున్నారు.