స్వ‌ర్ణాన్ని సాధించిన జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ చోప్రా

ఫిన్లాండ్ లో జ‌రుగుతోన్న కౌర్టెన్ గేమ్స్ లో స్వ‌ర్ణాన్ని సాధించాడు భార‌త జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ చోప్రా. నీరజ్‌‌‌ తన బల్లెంను అందరికంటే ఎక్కువగా 86.96 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం సాధించాడు. ఒలింపిక్స్ తర్వాత నీరజ్ కు ఇదే మొదటి స్వర్ణం.

ఈ పోటీల్లో నీరజ్ తన మొదటి ప్రయత్నంలోనే విసిరిన త్రో తోనే బంగారు పతకం అందుకోవడం విశేషం. సాధారణంగా జావెలిన్ త్రోలో ఒక్కో క్రీడాకారుడు ఆరుసార్లు బల్లెంను విసరవచ్చు. కానీ, ఈ పోటీల సమయంలో వర్షం వల్ల మైదానం తడిగా మారింది. నీరజ్ రెండో ప్రయత్నంలో లైన్ దాటి ఫౌల్ చేశాడు.
మూడో త్రో చేస్తున్నప్పుడు కాలు జారి కింద పడిపోయాడు. అదృష్టవశాత్తూ అతనికి గాయాలేమీ కాలేదు. చివరి మూడు త్రోలకు నీరజ్ దూరంగా ఉన్నాడు. మిగతా పోటీదారులు ఆరు ప్రయత్నాలు చేసినా భారత క్రీడాకారుడికి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు.
 కెషర్న్‌ వాల్కట్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో) 86.64 మీటర్ల దూరంతో రజతం నెగ్గగా, అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా) 84.75 మీటర్ల దూరంతో కాంస్యం సాధించాడు. నీరజ్ ఈ వారంలో ఫిన్లాండ్లోనే జరిగిన పావో నరుమి గేమ్స్‌‌‌‌లో 89.30 మీటర్ల దూరంతో తన పేరిట ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొడుతూ రజతం గెలిచాడు.
కామన్వెల్త్‌ జట్టుకు సారధ్యం 
  కాగా,  బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో తలపడే భారత అథ్లెటిక్స్‌ జట్టును ప్రకటించారు. 37 మందితో కూడిన ఈ జట్టుకు ఒలింపిక్‌ చాంపియన్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా నాయకత్వం వహిస్తాడని భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) తెలిపింది. జట్టులో 18 మంది మహిళలు,  19 మంది పురుషులున్నారు.
100 మీ. హర్డిల్స్‌లో ఇటీవలి కాలంలో వరుసపెట్టి జాతీయ రికార్డులు బద్దలుగొడుతున్న తెలుగు అథ్లెట్‌ జ్యోతి యర్రాజి మహిళల జట్టులో ఉంది. అలాగే స్టార్‌ అథ్లెట్లు హిమాదాస్‌, ద్యూతీచంద్‌ 4గీ100 మీ. రిలే జట్టులో బరిలోకి దిగుతారు. ఇంకా..అవినాశ్‌ సబ్లే, తజిందర్‌ పాల్‌ సింగ్‌ తూర్‌, శ్రీశంకర్‌, సీమా ఆంటిల్‌, అన్నూరాణి వంటి మేటి అథ్లెట్లతో భారత జట్టు పటిష్టంగా కన్పిస్తోంది. వచ్చేనెల 28 నుంచి ఆగస్టు ఎనిమిది వరకు కామన్వెల్త్‌ క్రీడలు జరగనున్నాయి