కాబూల్  గురుద్వారాపై ఐసిస్ ఉగ్రవాదుల దాడి

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్‌లో గురుద్వారా కర్టే పర్వాన్ శనివారం పేలుళ్ళతో దద్దరిల్లింది. మొత్తం ప్రాంగణం అగ్ని జ్వాలల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, తాలిబన్ సైనికులు ముగ్గురు గాయపడ్డారు. ఈ దాడుల వెనుక ఐసిస్ ఖొరసాన్ ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది.
ఈ గురుద్వారాపై దాడులు స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 7.15 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ పేలుళ్ళ కారణంగా సవిందర్ సింగ్ (60), గురుద్వారా గార్డు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు తాలిబన్ సైనికులు గాయపడ్డారు. దాడులకు పాల్పడిన ఇద్దరిని తాలిబన్ సైనికులు ముట్టడించారు. సుమారు ఎనిమిది మంది ఇంకా ఈ గురుద్వారాలో చిక్కుకున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆఫ్ఘన్ హిందువులు, సిక్కులు  దాదాపు 30 మంది వరకు శనివారం ఈ గురుద్వారాలో ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. దీంతో సుమారు 15 మంది తప్పించుకుని పారిపోగలిగారు. మిగిలినవారు లోపలే చిక్కుకుని, మరణించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో, కాబూల్  నగరంలోని పవిత్రమైన గురుద్వారాపై దాడి జరిగినట్లు వస్తున్న వార్తలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఇతర వివరాల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది.
విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. గురుద్వారా కర్టే పర్వాన్‌పై దాడి పిరికిపంద చర్య అన్నారు. దీనిని అందరూ తీవ్రంగా ఖండించాలని కోరారు. సిక్కుల సంక్షేమం పట్ల తాము మొదట ఆందోళన చెందుతున్నామని తెలిపారు.
బీజేపీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా మీడియాతో మాట్లాడుతూ, తాను గురుద్వారా కర్టె పర్వాన్ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్‌తో మాట్లాడానని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని సిక్కులకు అంతర్జాతీయ మద్దతును ఆయన కోరారని తెలిపారు.