
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడానికి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా (84) విముఖత వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా ప్రతిపాదించినా మాజీ ఉపప్రధాని, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహితం పోటీకి అనాసక్తి కనబరచారు.
రాష్ట్రపతి ఎన్నిక అంశంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత బుధవారం ఢిల్లీలో జరిపిన ప్రతిపక్షాల సమావేశంలో పవార్ సున్నితంగా పోటీకి తిరస్కరించడంతో ఆమె ఫరూఖ్ అబ్దుల్లాతో పాటు గోపాలకృష్ణ గాంధీల పేర్లను సూచించారు. గాంధీ సహితం ఇప్పటి వరకు పోటీకి ఆసక్తి వ్యక్తపరచలేదు.
“భారత రాష్ట్రపతి పదవికి మమతా బెనర్జీ సాహిబా ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా నా పేరు ప్రతిపాదించినందుకు, నేను గౌరవంగా భావిస్తున్నాను. మమతా దీదీ నా పేరును ప్రతిపాదించిన తర్వాత, నా అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తానని ప్రతిపక్ష నాయకుల నుండి నాకు చాలా కాల్స్ వచ్చాయి” అని అబ్దుల్లా ఒక ప్రకటనలో తెలిపారు.
అయితే కేంద్రపాలిత ప్రాంతంలో తన అవసరం ఎంతో ఉందని పేర్కొంటూ మాజీ ముఖ్యమంత్రి తన పేరును పరిశీలన నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. “జమ్మూకశ్మీర్ ఒక క్లిష్టమైన ఘట్టం గుండా వెళుతోందని నేను నమ్ముతున్నాను, ఈ అనిశ్చిత సమయాల్లో కశ్మీర్ ముందుకు సాగడంలో నా ప్రయత్నాలు అవసరం” అని ఆయన తన ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థి విషయమై ఓ నిర్ణయం తీసుకొనేందుకు ఈ నెల 21న శరద్ పవార్ నేతృత్వంలో మరోసారి సమావేశం కావాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు