సికింద్రాబాద్ విధ్వంసం కీలక సూత్రధారి అరెస్ట్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అటాక్ వెనక కుట్రకోణం వెలుగు చూసింది. అగ్నిపథ్ నిరసనల వెనుక కీలక సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్రణాళికతోనే విధ్వంసం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అభ్యర్థులను నర్సారావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు అనే వ్యక్తి రెచ్చగొట్టినట్టు పోలీసుల విచారణలో తెలిసింది.
నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీకి సుబ్బారావు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సొంతూరు ఖమ్మంలో సుబ్బారావు ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే సుబ్బారావును నరసరావుపేటకు తరలించారు. ఆయన ఆధ్వర్యంలోనే ఆందోళనకారులు వచ్చినట్లు గుర్తించారు.
ప్రైవేట్ అకాడమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడ్డారు. అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులకు షెల్టర్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. విద్యార్థులకు వాటర్ బాటిల్స్, బటర్ మిల్క్‌, పులిహోర ప్యాకెట్లు.. ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ అకాడమీలు సరఫరా చేసినట్టు తెలుస్తోంది. 10 ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు పాల్గొన్నట్లు గుర్తించారు. 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం జరిగిన విధ్వంసకాండకు సంబంధించి పోలీసులు 22మందిని అరెస్ట్ చేశారు. ఆందోళనకారుల్లో ఎక్కువగా సాయి డిఫెన్స్ అకాడమి నుంచి వచ్చినట్లు గుర్తించారు. నరసరావుపేట అభ్యర్థులే దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. గుంటూరు, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ ల నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

అల్లర్లలో రూ.12కోట్ల ఆస్తి నష్టం

ఇలా  ఉండగా, సికింద్రాబాద్ అల్లర్లలో ప్రత్యక్షంగా రూ.12కోట్లు ఆస్తి నష్టం జరిగిందని సికింద్రాబాద్ రైల్వే డివిజినల్ మేనేజర్ గుప్తా తెలిపారు. రైళ్ల రద్దు నష్టంపై అంచనా వేస్తున్నామని తెలిపారు. రైళ్లలో తరలిస్తున్న ప్రయాణికుల సామగ్రి భారీగా ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని తెలిపారు.
5 రైల్ ఇంజన్లు, 30 బోగీలు ధ్వంసమయ్యాయని గుప్తా వివరించారు.
అయితే డీజిల్ ట్యాంకర్‌కు భారీ ప్రమాదం తప్పిందని, పవర్‌కార్‌కు మంటలంటుకుంటే భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని రైల్వే గూడ్స్‌ను పునరుద్ధరించామని ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని గుప్తా తెలిపారు.