ఈడీ ముందు హాజరుకు బలప్రదర్శనగా రాహుల్… ఇరానీ ధ్వజం 

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్  కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం ప్రశ్నించడాన్ని ఆయన పార్టీ బలప్రదర్శనగా  మార్చుకుంది. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు పార్టీ కార్యకర్తలతో కలిసి దేశ రాజధానిలో వీధుల్లోకి  కాంగ్రెస్ అగ్రనేతలందరూ వచ్చారు. 
 
ఉదయం 11.10 గంటల నుంచి రాత్రి 11.10 వరకు, మధ్యలో భోజన విరామం తీసివేస్తే సుమారు 10 గంటల సేపు  సుదీర్ఘ విచారణను ఎదుర్కొన్నారు. మంగళవారం మళ్లీ రావాలని ఈడీ ఆదేశించింది. ఏదైనా దర్యాప్తు సంస్థ ఎదుట రాహుల్‌ హాజరు కావడం ఇదే ప్రథమం. ఒకవైపు ఆయన విచారణ ఎదుర్కొంటుండగా.. ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

ఈడీ కార్యాలయానికి రాహుల్‌ `ఊరేగింపుగా’ బయలుదేరేముందు  పార్టీ ముఖ్యమంత్రులు అశోక్‌ గెహ్లాట్‌, భూపేష్‌ బాఘెల్‌తో సహా పార్టీ సీనియర్‌ నేతలు, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు, పార్లమెంట్‌ సభ్యులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లు పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.

సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి రాహుల్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఏజెన్సీ కార్యాలయానికి కిలోమీటర్ దూరం ఊరేగింపుగా వెళ్లారు. ఆయనతో కలిసి వెళ్లేందుకు ప్రయత్నించిన సీనియర్‌ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా కూడా నిరసనలు జరిపారు. 

 
తొలి దఫా మధ్యాహ్నం 2.10 గంటల వరకు విచారించారు. అనంతరం ఈడీ అనుమతితో.. అనారోగ్యంతో సర్‌ గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి సోనియాగాంధీని చూసేందుకు రాహుల్‌ వెళ్లారు. ఆయన వెంట ప్రియాంక కూడా ఆస్పత్రికి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి వచ్చారు.
 
 రాత్రి 11 గంటల వరకు అధికారులు విచారించారు. 11.10కి బయటకు వచ్చారు. అంటే 10 గంటలకు పైగా రాహుల్‌ ప్రశ్నలు ఎదుర్కొన్నారన్న మాట. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక యంగ్‌ ఇండియన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అధీనంలో ఉంది. దాన్ని ప్రచురించే సంస్థ పేరు అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్‌). ‘యంగ్‌ ఇండియన్‌’ కంపెనీకి రాహుల్‌, సోనియా ప్రమోటర్లుగా ఉన్నారు.
 
 అందులో అత్యధిక వాటా వారిదే. ఆ కంపెనీ ఆవిర్భావం, ఏజేఎల్‌కు కాంగ్రెస్‌ ఇచ్చిన రూ.90.25 కోట్ల రుణం, నేషనల్‌ హెరాల్డ్‌లో అంతర్గతంగా నిధుల బదిలీ తదితర అంశాలపై ఈడీ అధికారులు రాహుల్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇంకొన్ని ప్రశ్నలు మిగిలి ఉండడంతో మంగళవారం మళ్లీ రమ్మన్నారు.
 
గాంధీ కుటుంభం ఆస్తులు కాపాడే ప్రయత్నమే 
 

అక్రమాలపై విచారణ జరిపితే ఎందుకు అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విస్మయం వ్యక్తం చేశారు. ఈడీ అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకే కాంగ్రెస్‌ ఆందోళనలు చేపట్టిందని, ఇది ముమ్మాటికీ కుట్రే అని ఆమె మండిపడ్డారు.  గాంధీ కుటుంభం ఆస్తులను రక్షించేందుకు కాంగ్రెస్‌ ఆందోళనలకు పిలుపునిచ్చిందని ఆమె విమర్శించారు.

రాహుల్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న నిరసన, గాంధీ కుటుంబానికి చెందిన రూ 2,000 కోట్ల ఆస్తులను కాపాడే ప్రయత్నమే అని స్పష్టం చేస్తూ  ఇది  ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం కాదని ఇరానీ పేర్కొన్నారు. ఏజీఎల్ కంపెనీని సమాజ శ్రేయస్సు కోసం ఏర్పాటు చేయగా, సమాజానికి సేవ చేయకుండా కేవలం గాంధీ కుటుంబ సేవకే పరిమితమవుతోందని ఆమె ఆరోపించారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో కాంగ్రెస్ నాయకుడిని ఓడించిన ఇరనై రాహుల్ గాంధీపై నేరుగా మాటల దాడి జరుపుతూ, “వాయనాడ్ ఎంపీ దేశానికి ‘డాటెక్స్ కంపెనీతో రాహుల్ గాంధీకి ఉన్న లింక్ ఏమిటి? అని వివరించాలి” అని డిమాండ్ చేశారు.

1930లలో అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ 5,000 మంది స్వాతంత్య్ర సమరయోధులను వాటాదారులుగా ఏర్పాటు చేసి, స్వాతంత్య్ర సమరయోధులు నడపాల్సిన సంస్థను నేడు గాంధీ కుటుంబం లాక్కుందని మంత్రి మండిపడ్డారు.

జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన వ్యక్తి కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి చేస్తున్నారని ఇరానీ ఎద్దేవా చేశారు. గాంధీ కుటుంబం అవినీతికి కాంగ్రెస్‌ శ్రేణులు మద్దతు తెలపడం విడ్డూరంగా ఉందని ఆమె ధ్వజమెత్తారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, అందులో రాహుల్‌ గాంధీ కూడా ఒకరని ఆమె స్పష్టం చేశారు.

కాగా, ఏ తప్పూ చేయనప్పుడు కాంగ్రెస్‌ నేతలు, రాహుల్‌ ఎందుకు భయపడుతున్నారని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి  శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రశ్నించారు.

ఎద్దేవా చేసిన టిఎంసి 

మరోవంక, రాహుల్‌కు ఈడీ సమన్లు పంపితే కాంగ్రెస్‌ కార్యకర్తలు రోడ్లపై నిరసనలు తెలపడం కపటత్వం తప్ప మరొకటి కాదని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ విమర్శించింది. తమ నేతలకు సమన్లు జారీ అయినప్పుడు ఆ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని తన అధికార పత్రిక ‘జాగో  బంగ్లా’లో పేర్కొంది. కేంద్ర ఏజెన్సీల నుంచి పిలుపు రాగానే కాంగ్రెస్‌ నాయకత్వం భయంతో వణికిపోతోందని ఎద్దేవాచేసింది.

దేశవ్యాప్త నిరసనలకు ఆ పార్టీ పిలుపునివ్వడం అవకాశవాద రాజకీయాలు, రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని స్పష్టం చేసింది. టీఎంసీ నేతలకు ఈడీ సమన్లు వచ్చినప్పుడు బెంగాల్‌ పీసీసీ అధ్యక్షుడు అధీర్‌ రంజన్‌ చౌధురి హర్షం వ్యక్తంచేశారని ఈ సందర్భంగా గుర్తు చేసింది.