ద్రౌపతి పేరు బదులు సీతాదేవి…  చిక్కుల్లో సుర్జేవాలా

ఒక్కక్క సీనియర్ నేత పార్టీ నుండి విడిచి పోతుండగా ఒక వైపు ఆత్మరక్షణలో  పడుతున్న  కాంగ్రెస్,  మరో వైపు పార్టీ నాయకుల మాటల తడబాటుతో చిక్కుల్లో పడుతున్నది. బిజెపిపై దాడి చేయబోయి వివాదాల్లో చిక్కుకొంటున్నారు.
తాజాగా,  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ర‌ణ్‌దీప్ సింగ్‌ సుర్జేవాలా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్ధ‌ల‌ను, ఈడీ, సీబీఐ, ఐటీ వంటి ద‌ర్యాప్తు ఏజెన్సీల‌ను కేంద్ర ప్ర‌భుత్వం నిర్వీర్యం చేస్తోంద‌ని అన్నారు. ఈ క్రమంలో మ‌హాభారతంలో ద్రౌప‌ది వ‌స్త్రాప‌హ‌ర‌ణాన్ని ప్ర‌స్తావించబోయి పొర‌పాటున సీతాదేవి పేరును చెప్పడం వివాదాస్పదంగా మారింది.
ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగ వ్య‌వ‌స్ధ‌లను నిర్వీర్యం చేస్తూ వాటి ప్రాధాన్య‌త‌కు కేంద్రం తూట్లుపొడుస్తోంద‌ని సూర్జేవాలా ఆరోపించారు. ఈ క్రమంలో సీతాదేవి వ‌స్త్రాప‌హ‌ర‌ణం త‌ర‌హాలోనే బీజేపీ ప్ర‌జాస్వామ్య విలువ‌లను ఊడ‌దీయాల‌ని కాషాయ పార్టీ కోరుకుంటోంద‌ని రణ్‌దీప్‌ దుయ్య‌బ‌ట్టారు.
 బీజేపీ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌బోవ‌ని, రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి భంగ‌పాటు త‌ప్ప‌ద‌ని ఆయన కామెంట్స్‌ చేశారు.  కాగా, కౌరవ సభలో పాండ‌వుల స‌మ‌క్షంలో ద్రౌప‌ది వ‌స్త్రాప‌హ‌ర‌ణం గురించి ప్ర‌స్తావించబోయిన‌ సుర్జేవాలా పొర‌పాటున సీతాదేవీ పేరును పలికారు.
ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేత వ్యాఖ‍్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఇక, సూర్జేవాలా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.