అరెస్టయిన ఢిల్లీ మంత్రి ఇంట్లో రూ 2.85 కోట్ల  నగదు 

అరెస్ట్ అయి,  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఇంట్లో రూ 2.85 కోట్లకు పైగా నగదుతో పాటు 1.8 కిలోల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఆయని నివాస ప్రాంతాల్లో ఈడీ సోమవారం సోదాలు నిర్వహించగా వీటిని స్వాధీనం చేసుకున్నది.

అంతేకాదు ఆ రూ.2 కోట్ల నగదును ఎస్ రామ్ ప్రకాష్ జ్యువెలర్స్ లిమిటెడ్ ఆవరణలో స్వాధీనం చేసుకున్నట్లు ఇది  తెలిపింది. పైగా రామ్ ప్రకాష్ జ్యువెలర్స్ లిమిటెడ్‌కి డైరెక్టర్లుగా వైభవ్ జైన్, అంకుష్ జైన్, నవీన్ జైన్‌లు డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పారు.

సత్యేందర్‌ని కోల్‌కతా కంపెనీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏప్రిల్‌లో రూ.4.81 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్ చేసి అరెస్టు చేసిన సంగతి విధితమే. దీంతో సత్యేందర్‌ జైన్‌ని జూ న్‌ 1 నుంచి 9 వరకు దర్యాప్తు సంస్థ కస్టడీలోనే ఉన్నారు.

సత్యేందర్‌ వాటాదారుగా ఉన్న నాలుగు కంపెనీలకు వచ్చిన నిధుల మూలాన్ని వివరించలేకపోయారని ఈడీ  ఆరోపించింది. ఆయన ఢిల్లీలో అనేక కంపెనీలను కొనుగోలు చేయడమే కాకుండా వాటి ద్వారా సుమారు రూ. 16.39 కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చకున్నారంటూ దర్యాప్తు సంస్థ పేర్కొంది. 

ఆయన్ను, కొంత మంది హవాలా ఆపరేటర్లను విచారించిన తర్వాత.. దీనికి సంబంధించిన లింకులు, ఆధారాలు గుర్తించామని, మరిన్ని వివరాలు సేకరించేందుకు దాడులు నిర్వహించినట్లు ఇడి అధికారులు తెలిపారు.