ఇస్లామిక్ సంస్థ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన భారత్ 

మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల దుమారం అంతకంతకూ పెరుగుతుండటం, సౌదీ అరేబియా, ఆప్ఘనిస్థాన్, ఆర్గనేజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ దీనిపై ప్రకటనలు చేయడంపై భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది.  ఓఐసీ వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమని, సంకుచితమని సమాధానం ఇచ్చింది. మైనారిటీల విషయంలో పాకిస్థాన్ రికార్డు అందరికీ తెలిసిందేనని వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
ఖతార్, ఇరాన్, కువైట్‌, సౌదీ అరేబియా  ప్రభుత్వాలు భారత రాయబారులను పిలిపించి తమ నిరసనను వ్యక్తం చేశాయి.  అయితే  నుపుర్, నవీన్ కుమార్‌పై తీసుకున్న చర్యలను అవి అభినందించాయి.  కాగా, ఈ విమర్శలపై భారత ప్రభుత్వం బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయకుండా సంయమనం పాటిస్తూనే, ఓఐసీ వ్యాఖ్యలను తిప్పికొట్టింది.
దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరవింద్ బాగ్చి ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్‌పై ఆర్గనేజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) జనరల్ సెక్రటేరియట్ ఇచ్చిన ప్రకటన తాము చూశామని, ఆ ప్రకటన పూర్తిగా అనుచితమని, సంకుచిత మనస్తత్వంలో చేసినవని, భారత ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతోందని ఆయన పేర్కొన్నారు.
అన్ని మతాల పట్ల అత్యంత గౌరవభావం భారత ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. మత ప్రముఖులను కించపరచే వాఖ్యలు, ట్వీట్లు ఎవరైనా వ్యక్తిగతంగా చేస్తే, అధి భారత ప్రభుత్వ అభిప్రాయంగా భావించడం సరికాదని హితవు చెప్పారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు.
ఓఐసీ మరోసారి ఉద్దేశపూర్వకంగా, తప్పుదారి పట్టించే విధంగా వాఖ్యలు చేయడం విచారకరమని బాగ్చి ధ్వజమెత్తారు. ఇది ఓఐసీ తీరును, స్వార్ధ ప్రయోజనాల కోసం విభజన ఎజెండాను ముందుకు తీసుకువెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాసలను బహిర్గతం చేస్తోందని మండిపడ్డారు. ”మతతత్వ ధోరణికి   స్వస్తి చెప్పండి. అన్ని మతాలు, విశ్వాసాలను గౌరవించండి” అంటూ ఓఐసీకి బాగ్చి హితవు పలికారు.