యూపీ బుల్డోజర్ తో కేసీఆర్ కుటుంబ పాలనను పెకిలించబోతున్నాం  

యూపీ నుండి బుల్డోజర్ ను తెలంగాణకు తీసుకొచ్చి కేసీఆర్ నియంత, అవినీతి, కుటుంబ పాలనను పెకిలించబోతున్నామని బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్ భరోసా వ్యక్తం చేశారు. రాజ్యసభకు ఎన్నికైన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ కు వచ్చిన ఆయనకు పార్టీ కార్యకర్తలు శనివారం సాయంత్రం ఘనస్వాగతం పలికారు. 
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన అభినందన సభలో పార్టీ నాయకులు, కార్యకర్తలంతా లక్ష్మణ్ ను పూల బోకేలు, శాలువాసహా వివిధ రూపాల్లో ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ  తన ఎంపిక వల్ల తెలంగాణ ప్రజలకు బీజేపీ స్పష్టమైన సంకేతమిచ్చిందని చెప్పారు. కష్టపడే కార్యకర్తలకు అవకాశాలుంటాయని పేర్కొంటూ ఎవ్వరూ తొందరపాటు చర్యలకు పాల్పడవద్దనే విషయాన్ని చెప్పిందని తెలిపారు. 
 
తెలంగాణలో ఏ వర్గాలు బీజేపీ దూరంగా ఉన్నాయో ఆ వర్గాలను సైతం బీజేపీవైపు ఆకర్షించేందుకు తన వంతు క్రుషి చేస్తా అని పేర్కొంటూ తద్వారా తెలంగాణలో అదికారంలోకి వచ్చేలా అడుగులు వేయాలని జాతీయ నాయకత్వం తనకు చెప్పిందని తెలిపారు. మోదీ, యోగీ తరహా పాలన తెలంగాణలో రావడానికి కార్యకర్తలంతా క్రుషి చేయాలని ఈ సందర్భంగా పిలుపిచ్చారు. .
 
రాముడి ఆశీర్వాదంతో లక్ష్మణుడిగా వెళ్లి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని తనను యోగి ఆదిత్యనాథ్ కోరారని డా. లక్ష్మణ్ వెల్లడించారు.  తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలన్నా, పేదలకు సేవ చేసే పాలన రావాలంటే బీజేపీతోనే సాధ్యం అని స్పష్టం చేశారు. అందుకోసం అందరం కలిసి పనిచేద్దాం.. పాతవాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడుతూనే పార్టీలోకి వచ్చే కొత్త నేతలను కలుపుకుపోతూ అధికారం సాధిస్తాం అని సూచించారు. 
 
  కాంగ్రెస్, టీఆర్ఎస్ ఓకే గూటి పక్షులు. కుటుంబ పాలనలో, కలిసి దోచుకోవడంలో, కలిసి పోటీ చేయడంలో రెండు పార్టీలు దొందు దొందే ని ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలను వచ్చే ఎన్నికల్లో దోషిగా నిలబెడతామని తేల్చి చెప్పారు.  పొరపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే టీఆర్ఎస్ కు ఓటేసినట్లే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్-టీఆర్ఎస్-మజ్లిస్ పార్టీ లు వేర్వేరు కాదు. మూడు ఒక్కటే అని పేర్కొంటూ  పార్లమెంట్ లో టీఆర్ఎస్ ను దోషిగా నిలబెడతా అని హెచ్చరించారు.
 
యూపీ మాదిరిగా తెలంగాణను అభివ్రుద్ధి చేస్తామని చెబితే ట్విట్టర్ పిట్ట అడ్డగోలుగా మాట్లాడారని పేర్కొంటూ కేటీఆర్ ఒక్కసారి తనతో వస్తే  యూపీలో జరిగిన అభివ్రుద్ధిని వివరిస్తా అని సవాల్ చేశారు. గంగాలో మునిగి పాపాలు పోగొట్టుకోండని హితవు చెబుతూ అయినా కేటీఆర్ కు మూసీ నీళ్లే బెటర్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి చేసిన మోసాలతో ప్రజలను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. 
 
యూపీలో 5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తే  తెలంగాణలో మాత్రం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా  భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. యూపీకి, తెలంగాణకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెబుతూ కరోనా సమయంలో 15 కోట్ల మంది ప్రజలకు నెలకు రెండుసార్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఘనత యూపీ ప్రభుత్వానిదే అని తెలిపారు. 
 
 కోటి మందికి ఆయుష్మాన్ భారత్ కింద వైద్య చికిత్స చేస్తున్నారు. 2010 దాకా యూపీ బడ్జెట్ లక్షన్నర కోట్లు మాత్రమే.. యోగీ ప్రభుత్వం వచ్చాక రూపాయి పన్ను పెంచకుండా రూ. 6 లక్షల కోట్ల బడ్జెట్ కు చేర్చిన ఘనత బీజేపీదే అని గుర్తు చేశారు.  కేసీఆర్ వేల కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టి దేశవ్యాప్తంగా ప్రకటనలిస్తున్నారు.. ఇక్కడి సంక్షేమ పథకాలతో ఇతర రాష్ట్రాలకు పనేముంది? అని ప్రశ్నించారు. 
 
‘కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చిందో పూర్తి వివరాలు వెల్లడించడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. తేదీ, వేదిక మీరే చెప్పండి. మీరు, మీ తండ్రి రాజీనామా లేఖలతో సిద్ధంగా ఉండండి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కేటీఆర్ కు సవాల్ చేశారు. కేంద్రం తెలంగాణకు రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని, తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్‌ చేసిన సవాల్‌ ను కొట్టిపారవేసారు.  
 
హైదరాబాద్‌లో బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే సాంకేతికత.. డ్రోన్‌లు ఏమయ్యాయని కేటీఆర్‌ను నిలదీశారు. రాజ్యసభకు లక్ష్మణ్ ఎన్నిక ద్వారా తెలంగాణలో ఈసారి ఎగరేది బీజేపీ జెండా మాత్రమేననే సంకేతాలు జాతీయ నాయకత్వం పంపిందని స్పష్టం చేశారు.
 
  బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, శాసనసభాపక్ష నేత రాజాసింగ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, తమిళనాడు సహ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, జి.వివేక్ వెంకటస్వామి, శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎంపీలు రవీంద్రనాయక్, చాడా సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.