రామమందిర గర్భగృహానికి యోగి శంకుస్థాపన

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం వైదిక ఆచారాల మధ్య అయోధ్యలో  రామమందిర గర్భగృహానికి   శంకుస్థాపన చేశారు. దాదాపు రెండేళ్ల క్రితం అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని గుర్తు చేస్తూ నిర్మాణ పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వేడుకలో భాగస్వామి కావడం మా అదృష్టమని పేర్కొన్నారు.
 
“రామమందిరం దేశానికే దేవాలయం అవుతుంది. ఈ రోజు కోసం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో రామమందిరం భారతదేశ ఐక్యతకు చిహ్నం” అని ముఖ్యమంత్రి తెలిపారు. దేవాలయం నిర్మాణం కోసం 500 ఏళ్ల పోరాటం ముగిసిందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.
దేవాలయ నిర్మాణ సాధన ఉద్యమంలో విశ్వహిందూ పరిషత్ నాయకుడు అశోక్ సింఘాల్ పాత్రను ఈ సందర్భంగా యోగి గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా కూడా హాజరయ్యారు.
గర్భ గృహ నిర్మాణంకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ పూజలు జరపడంతో రామమందిర నిర్మాణం రెండోదశ పనూలు ప్రారంభం అవుతాయని ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య తెలిపారు. జూన్ 4 వరకు “ప్రాణ ప్రతిష్ట” కార్యక్రమం కొనసాగుతుందని పురోహితులు ఆచార్య రాఘవాచార్య తెలిపారు. 
ఈ కార్యక్రమంలో 11 మంది అర్చకులు పూజలు జరిపారు. రామమందిర నిర్మాణ పనులకు సంబంధించిన పుస్తకాన్ని కూడా ఆదిత్యనాథ్ విడుదల చేశారు.  2022 ఫిబ్రవరిలో ప్రారంభించిన గ్రానైట్ రాయితో పనులు  2022 ఆగస్టు నాటికి  పూర్తవుతాయని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా తెలిపారు.

దాదాపు 17,000 రాళ్లను ఈ స్తంభం నిర్మాణంలో వినియోగించనున్నారు. “మేము మూడు దశల కాలపరిమితిలో పనులు పూర్తి  చేయడానికి సంకల్పించాము. 2023 నాటికి గర్భగృహ, 2024 చివరి నాటికి ఆలయ నిర్మాణం, 2025 నాటికి ఆలయ సముదాయంలో ప్రధాన నిర్మాణాలు పుత్తవుతాయని” అని ఆయన విలేకరులకు తెలిపారు.

నిరూపితమైన, పరీక్షించిన నాణ్యమైన గ్రానైట్ రాయిని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సేకరిస్తున్నట్లు మిశ్రా కార్యాలయం తెలిపింది. కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్వే మంత్రిత్వ శాఖ అయోధ్యకు గ్రానైట్ లను వేగంగా తరలించడంలో  పూర్తి సహాయాన్ని అందిస్తున్నాయి.

 
ఆలయ నిర్మాణంలో రాజస్థాన్ బన్సీ పహర్‌పూర్ రాయిని చెక్కారు. ఇప్పటికే చెక్కడం పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు, దాదాపు 75,000 క్యూబిక్ అడుగుల  రాతి చెక్కడం పూర్తయింది. ఆలయంలో కేవలం సూపర్ స్ట్రక్చర్‌కే మొత్తం 4.45 లక్షల సీఎఫ్‌టీ రాయి అవసరం. డిసెంబర్, 2023 నాటికి భక్తులకు ఆలయమును అందుబాటులోకి తెచ్చే విధంగా వేగంగా పనులు చేస్తున్నారు. 
రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలోని బన్సీ పహార్‌పూర్‌లోని ఇసుకరాళ్లను ఆలయ ప్రధాన నిర్మాణం కోసం ఉపయోగించనున్నారు. 16వ శతాబ్దపు బాబ్రీ మసీదు కూల్చివేసిన స్థలంలో ఆలయ నిర్మాణానికి 2019లో సుప్రీంకోర్టు మార్గం సుగమం చేయడం తెలిసిందే.