కాంగ్రెస్ తో చేతులు కలిపితే మట్టి కరవడమే!

2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడం నుండి తాను ఏ పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యత నిర్వహించినా ఆ పార్టీ లేదా నాయకుడు ఎన్నికలలో ఘన విజయం సాధిస్తూ వచ్చారని భావిస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కాంగ్రెస్ అంటే భయపడుతున్నారు. ఆ పార్టీలో చేతులు కలపడం అంటే మట్టికరవడమే అని స్పష్టం చేస్తున్నారు. 
 
ఆ భయంతోనే దాదాపు ఆ పార్టీలో చేరడానికి సిద్దమై కూడా, ఈ రాజకీయాలు వద్దు బాబు అంటూ వెనుకడుగు వచ్చినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ వల్ల తన ట్రాక్ రికార్డు  పాడయిందని, ఆ పార్టీతో పనిచేసేది లేదని స్పష్టం చేశారు. 
 
‘‘కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు. పాఠాలు నేర్చుకోవడం, తప్పులను దిద్దుకోవడం ఆ పార్టీ చరిత్రలోనే లేదు. అది రాజకీయంగా మట్టికరవడం ఖాయం. వెంటున్న అందరినీ కూడా తనతో పాటు తీసుకెళ్తుంది. ఆ పార్టీ బాసులు తాము మునగడమే గాక అందరినీ ముంచేస్తారు. కాంగ్రెస్‌లో చేరితే నేనూ మునగడం ఖాయం’’ అంటూ ఆ పార్టీతో తన అనుభవాలను తలచుకొంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
హార్‌లోని వైశాలిలో ఉన్న దివంగత ఆర్జేడీ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ నివాసం నుంచి తన ”జన్ సురాజ్ యాత్ర”ను మంగళవారంనాడు ప్రశాంత్ కిశోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  వివిధ పార్టీలతో కలిసి తాను పనిచేసిన వైనాన్ని, ఆయా పార్టీలు గెలుపొందిన విషయాన్ని ప్రస్తావించారు. 2017 యూపీ ఎన్నికలను కూడా ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ పార్టీ వల్లే తాను (వ్యూహకర్తగా) ఓడిపోయానని పేర్కొన్నారు. దీంతో తన ట్రాక్ రికార్డు దెబ్బతిందని, వారితో పని చేసేది లేదని తేల్చి చెప్పారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగయ్యే పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు.‘‘గత పదేళ్లలో బిహార్‌ నుంచి పంజాబ్‌ దాకా కనీసం 11 ఎన్నికల్లో ఎన్నో పార్టీలతో పని చేశాం. ఎక్కడా ఓటమి లేని మా ట్రాక్‌ రికార్డుకు 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పని చేయడం గండికొట్టింది. అందుకే ఆ పార్టీతో ఇంకెప్పుడూ కలిసి పని చేయొద్దని నిర్ణయించుకున్నాం’’ అని చెప్పుకొచ్చారు.
 
 ”మహకూటమితో 2015లో బీహార్‌లో గెలిచాం. 2017లో పంజాబ్‌లో, 2019లో జగన్ మోహన్‌రెడ్డితో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో గెలిచాం. కేజ్రీవాల్‌తో 2020లో ఢిల్లీలో, 2021లో తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో గెలిచాం. కానీ  2017లో కాంగ్రెస్‌తో కలిసి యూపీలో ఓడిపాయాం” అని  ప్రశాంత్ కిషోర్ గుర్తు చేశారు. 
 
ఆ కారణంగానే కాంగ్రెస్‌తో కలిసి పనిచేయరాదని నిర్ణయించుకున్నట్టు ఆవమా చెప్పారు. ఆ పార్టీ అంటే తనకు గౌరవం ఉందని, అయితే ప్రస్తుత పరిస్థితిలో ఆ పార్టీ తనంత తానుగా మెరుగయ్యే పరిస్థితి లేదని కూడా తేటతెల్లం చేశారు. తానెప్పటికీ కాంగ్రెస్‌లో చేరబోనంటూ నాటకీయంగా చేతులు జోడించి(దణ్ణం పెట్టి) మరీ చెప్పారు.
 
ఈ ఏడాది జరిగే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలో ఇటీవలి చింతన్‌ శిబిర్‌ పూర్తిగా విఫలమైందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పునరుత్థానానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ పెద్దలకు కొద్ది వారాల క్రితం పీకే ప్రజెంటేషన్‌ ఇవ్వడం, ఆయన పార్టీలో చేరతారంటూ వార్తలు రావడం, అలాంటిదేమీ లేదని ఆయన ప్రకటించడం తెలిసిందే.