కశ్మీరులో ఉపాధ్యాయురాలు కాల్చివేత.. ఇద్దరు ఉగ్రవాదుల హతం 

జమ్మూ-కశ్మీరులో కాల్పుల మోత కొనసాగుతున్నది.  మరో లక్షిత దాడి జరిపి ఓ ఉపాధ్యాయురాలిని కాల్చివేయగా, భద్రతా దళాల్లో మరో చోట ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. ఓ వర్గానికి చెందినవారిని వరుసగా హత్య చేస్తుండటంపై పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ, వారికి భద్రత కరువవుతోంది.

 ఇటీవలే ఓ ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్న రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. మంగళవారం ఉదయం ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపి, హత్య చేశారు.  కశ్మీరు జోన్ పోలీసులు ఇచ్చిన ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, కుల్గాం జిల్లాలోని గోపాల్‌పుర ప్రాంతంలో ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయిరాలినిపై ఉగ్రవాదులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు.

ఈ సంఘటనలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, బాధితురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించేందుకు ఆమె సహోద్యోగులు ప్రయత్నించారు. కానీ ఆమె అప్పటికే ప్రాణాలు విడిచారు. ఈ టీచర్ స్వస్థలం జమ్మూ అని తెలుస్తోంది.

ఉగ్రవాదులు సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తుండటం కొనసాగుతోంది. 2021లో ఈద్గా సంగం వద్ద సతీందర్ కౌర్, దీపక్ చంద్ అనే టీచర్లను కూడా ఉగ్రవాదులు హత్య చేశారు.  ఇటీవల టీవీ నటి అమ్రీన్ భట్‌ను కూడా ఉగ్రవాదులు హత్య చేశారు. ఆమెను హత్య చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

ఇలా ఉండగా, జమ్మూకశ్మీర్‌లోని అవంతిపోరా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటన స్థలంలో పోలీసులు రెండు ఏకే-47 రైఫిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

హతమైన ఉగ్రవాదులను ట్రాల్‌కు చెందిన షాహిద్ రాథర్, షోపియాన్‌కు చెందిన ఉమర్ యూసుఫ్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. హతులు పలు ఉగ్రవాద నేరాలతో పాటు, షాహిద్ అరిపాల్‌కు చెందిన షకీలా అనే మహిళను,  లుర్గామ్ ట్రాల్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి జావిద్ అహ్మద్‌ను హత్య చేశాడరి కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్ చేశారు.

పుల్వామాలోని గుండిపురలో సోమవారం జరిగిన  ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు.ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర అవంతిపోరా ప్రాంతంలో పోలీసులు, భద్రతా బలగాలతో కలిసి గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పులు జరపగా ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు.