దేశ ప్రధానిని కాదు.. 130 కోట్ల ప్రజలకు సేవకుడిని

ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తాను ప్రధానమంత్రిగా భావించలేదని, కేవలం ఫైల్స్ పై సంతకం చేసినప్పుడు మాత్రమే ప్రధాన మంత్రిగా భావిస్తానని, అనంతరం తాను 130 కోట్ల ప్రజలకు సేవకుడిగా తాను భావించడం జరుగుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2014 కంటే ముందు ఇప్పుడు ఎంతో సురక్షితంగా ఉందని అంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. 

భారత్ అమలు చేస్తున్న పథకాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోందని, అంతేగాకుండా భారత్ స్టార్టప్ ల ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నట్లు ప్రధాని వెల్లడించారు. భారతదేశ సరిహద్దులు గతంలో ఖంటే సురక్షితంగా ఉన్నట్లు ప్రధాని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు మేలు జరగాలని చెబుతూ  పేద ప్రజలకు నేరుగా వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం చూస్తుందని పేర్కొన్నారు.

అవినీతి విషయంలో గత ప్రభుత్వాలు ఏమి చేయలేదని మండిపడుతూ  ప్రజల వద్దకు చేరుకోకుండానే డబ్బులను లూఠీ చేశారని విమర్శించారు. ధన్ జన్ యోజన ఖాతా ద్వారా ప్రజలకు డబ్బులు అందుతున్నట్లు ప్రధాని తెలిపారు. కేంద్రంలో బీజేపీ సర్కారు ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలో.. మే 31వ తేదీ మంగళవారం ఆయన సిమ్లాలో పర్యటించారు. రిడ్జ్ మైదాన్ కు వెళుతున్న సమయంలో ఆయనపై ప్రజలు పూల వర్షం కురిపించారు. అనంతరం నిర్వహించని గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ లో ప్రసంగించారు. కేంద్ర ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) పథకంలో భాగంగా 11వ విడత నిధుల్ని ప్రధాని ఈ సందర్భంగా  విడుదల చేశారు. ఈ వేదికగానే ఆయన రైతుల ఖాతాలో నగదు జమ చేశారు. 

తొమ్మిది మంత్రిత్వ శాఖల ద్వారా అమలు అవుతున్న 16 పథకాల పని తీరు గురించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని స్వయంగా కొందరు లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇక పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6000 ( రూ 2,000  చొప్పున మూడు దఫాలుగా) అందిస్తోంది.

ఏడాదికి మూడు విడతచొప్పున ఇప్పటి వరకు 10 ఇన్‌స్టాల్మెంట్లలో డబ్బులు రైతుల ఖాతాల్లోకి చేరగా, ఇవాళ 11వ విడత డబ్బులు జమ చేసింది. దాదాపు పది కోట్ల కంటే ఎక్కువ మంది రైతుల ఖాతాలో పీఎం సమ్మాన్‌ నిధి నుంచి రూ.21 వేల కోట్ల రూపాయలను విడుదల చేశారాయన.

అయితే ప్రభుత్వం నుండి పిఎం కిసాన్ పథకం ద్వారా.. దేశంలోని రైతులందరికీ గ్రాంట్లు అందవు. పిఎం  కిసాన్ పథకానికి అర్హత ప్రమాణాలు ఉన్నాయి. ముందుగానే రిజిస్టర్‌ అయ్యి ఉండాలి. అలాగే చిన్న మరియు సన్నకారు రైతులు ప్రయోజనాలను పొందుతారు. కొన్ని షరతులు కూడా వర్తిస్తాయి.