రామాలయం నిర్మాణం కాశీ, మథుర…. లకు దారి చూపిస్తుంది

అయోధ్యలో రామాలయం నిర్మాణం కాశీ, మథుర, బృందావన్‌, వింద్యావాసిని ధామ్‌, నైమిష్‌ధామ్‌లకు దారి చూపిందని ఉత్తర్ ప్రదేశ్  ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ భరోసా వ్యక్తం చేశారు.  లక్నోలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మత ఘర్షణలు లేవని గుర్తు చేశారు. మొదటి సారి రాష్ట్రంలో ఈద్‌ చివరి శుక్రవారంనాడు రోడ్లపై నమాజ్‌ జరగలేదని తెలిపారు. 

కాశీ విశ్వనాధ్‌ ఆలయ కారిడార్‌పై స్పందిస్తూ ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు కాశీని సందర్శిస్తారని, ప్రధాని మోదీ  దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రదేశం తన ప్రాముఖ్యతను రుజువు చేస్తోందని చెప్పారు. వారణాసి, మధురల్లోని ఆలయం-మసీదు నిర్మాణాలపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 

అయోధ్యలో రామాలయం నిర్మాణంతో కాశీ నిర్మాణం మన ముందుకు వచ్చిందని ఆదిత్యనాథ్ చెప్పారు. అలాగే మథుర, బృందావన్‌, వింద్యావాసిని ధామ్‌, నైమిషధామ్‌లకు కూడా మేల్కల్పాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. లౌడ్‌స్పీకర్ల కారణంగా అనవసరమైన శబ్దకాలుష్యం తప్ప ప్రయోజనం లేదని పేర్కొన్నారు. 

అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా రెండోసారి గెలుపొందిన తర్వాత జరిగిన మొదటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నామని చెప్పారు.  రాష్ట్రంలో 80 సీట్లకు గాను 75 సీట్లు సాధిస్తామని ముఖ్యమంత్రి జోస్యం చెప్పారు. 2019 ఎన్నికలలో బిజెపి 62 సీట్లు గెలుపొందగా, మిత్ర పక్షం అప్నాదళ్ (ఎస్) రెండు సీట్లు గెలుచుకుంది. 

“ప్రజల సహాయంతో, కరోనా సమయంలో మనం చేసిన కృషి కారణంగా మనం అసెంబ్లీ ఎన్నికలలో మెరుగైన ఫలితాలను పొందాము. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్‌లో 75 సీట్లు సాధించడమే లక్ష్యంగా మనం ముందుకు సాగాలి” అని పిలుపిచ్చారు. ప్రధానిగా ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్నందుకు మోదీకి అభినందనలు తెలిపిన ఆదిత్యనాథ్, 2024 రోడ్‌మ్యాప్‌తో బీజేపీ తన లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్ నాలుగు డజన్ల పథకాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉందని చెబుతూ  2017 తర్వాత రాష్ట్రం గురించిన అభిప్రాయం ప్రజలలో గణనీయంగా మారిందని ఆదిత్యనాథ్ తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం నవభారతంగా రూపుదిద్దుకుంటోందని, నవ భారతావని కొత్త ఉత్తరప్రదేశ్ కూడా సిద్ధమైందని పేర్కొన్నారు.

ప్రతిపక్షాల కుట్రలన్నింటినీ రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారని ఆయన స్పష్టం చేశారు. “ప్రభుత్వం, ప్రతిపక్షం ప్రతి పౌరునికి చేరువైనప్పుడు, దాని ఫలితం ఏమిటంటే ప్రజలు అన్ని రకాల ప్రచారాలు, కుట్రలు, పొత్తులు, మెగా కూటమిలను తిరస్కరించారు. వారు బిజెపిపై విశ్వాసం ఉంచారు.  బిజెపికి మూడింట రెండు వంతుల ఆదేశాన్ని ఇచ్చారు” అని తెలిపారు. 

కుట్రలు పన్నుతామని, ఒక ఇమేజ్‌ క్రియేట్‌ అవుతుందని కలలు కన్నవారు, ఛిన్నాభిన్నమైన ఆదేశం ద్వారా తమ దోపిడీ యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్తారని, అదంతా బట్టబయలైందని ఆదిత్యనాథ్ ఎద్దేవా చేశారు.

మనం ‘లోక్ కళ్యాణ్ సంకల్ప్ పత్ర’తో ప్రజల కోర్ట్ (2022 అసెంబ్లీ ఎన్నికలు)కి వెళ్ళాము. 130 వాగ్దానాలతో ముందుకు సాగామని, తొలి బడ్జెట్‌లోనే 97 వాగ్దానాలను తాకామని, ఇందుకోసం రూ.54,883 కోట్ల కేటాయింపులు చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ‘సంకల్ప్’ (వాగ్దానాలు) లేకుండా ‘వికల్ప్’ (ప్రత్యామ్నాయం) లేదని చెబుతూ ఈ వాగ్దానాలన్నీ నెరవేరుతాయని స్పష్టం చేశారు.