24 గంటల విద్యుత్ పేరుతో కేసీఆర్ పెద్ద స్కామ్!

24 గంటల విద్యుత్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం  పెద్ద కుంభకోణంకు పాల్పడుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.  సీఎంకు యూనిట్ రూ.6 పెట్టి విద్యుత్ కొంటున్నారని చెబుతూ ప్రభుత్వ కార్యాలయాలు రూ.17 వేల కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఆయన తెలిపారు. 

సిద్దిపేట్, గజ్వేల్, పాతబస్తీ ప్రాంతల్లో విద్యుత్ బిల్లులు కట్టడం లేని,  40 గ్రామలకు ఉపయోగించే విద్యుత్ ను కేసీఆర్ ఫాం హౌస్ కు వినియోగిస్తుండని సంజయ్ ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌ కోసం ప్రత్యేకంగా సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారని.. 40 గ్రామాలకు సరిపోయే విద్యుత్తును ఉచితంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలో నిర్మించిన భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌(బీటీపీఎ్‌స)లో అతిపెద్ద కుంభకోణం జరిగిందని సంజయ్‌ ఆరోపించారు. కాలం చెల్లిన టెక్నాలజీతో కూడిన యంత్రాలతో ఈ ప్లాంటు నిర్వహణ అసాధ్యమని ఇండియా బుల్స్‌ అనే సంస్థ తప్పుకుందని చెప్పారు.

టీఆర్‌ఎస్‌ పెద్దలు, బినామీ వ్యక్తులతో కాలం చెల్లిన టెక్నాలజీతో కూడిన యంత్రాలను కొనుగోలు చేయించి కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. గిట్టుబాటు కాని ఈ విద్యుత్‌ ప్లాంట్‌పై రూ.వేల కోట్లు ఎందు కు వెచ్చిస్తున్నారో సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

8 ఏళ్ల బీజేపీ పాలనలో మిగులు ఏర్పడేలా చేసింది ఒక్క మోదీ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. ‘టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. వారి దృష్టి మళ్లించి కేంద్రాన్ని బద్నామ్‌ చేసే కుట్రలకు సీఎం కేసీఆర్‌ పాల్పడుతున్నారు’అని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కాలు ష్యం పేరుతో కేసీఆర్‌ ప్రభుత్వం మూసేయించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ధ్వజమెత్తారు. రామగుండంలో రూ 6 వేల కోట్ల పైగా నిధులతో ఎరువుల కర్మాగారం కేంద్రం ఏర్పాటు చేసిందని, రైతుల కోసం ఏర్పాటు చేసిన రామగుండం ఎరువుల కర్మాగారంను మూసివేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎరువులకు ఇబ్బంది లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుంటే బీజేపీకి పేరొస్తుందనే ఫ్యాక్టరీని మూసేయించారని ఆరోపించారు.

ఫ్యాక్టరీలో ఉద్యోగాలిప్పిస్తానని టీఆర్‌ఎస్‌ నేతలు ఎంతోమంది యువకుల నుంచి రూ. కోట్లు దండుకున్నారని, వాళ్లంతా తిరగబడుతున్నారని విమర్శించారు. ‘హైదరాబాద్‌ చుట్టూ చాలా ఫార్మా కంపెనీలున్నయ్‌.  వాటిని మూసేస్తరా?’అని నిలదీశారు.

కాగా, సింగరేణి కార్మికుల డిపాసిట్లు డ్రా చేసి జీతాలు చెల్లించే స్థాయికి కేసీఆర్ దిగజారిండని సంజయ్ ధ్వజమెత్తారు. ‘‘కేసీఆర్‌ ప్రభుత్వానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు. సింగరేణి డిపాజిట్లను కూడా ప్రభుత్వం తీసుకుంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆగమైంది’’ అని విమర్శించారు.

మతాల గురించి మాట్లాడే వాళ్లకు బైంసా ఘటన, నిర్మల్, కామారెడ్డి, మర్పల్లి హత్యలపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. హిందువులపై ఎందుకు వెటకారమన్న బండి సంజయ్ తాము ఎప్పుడైనా అల్లా లేడు అన్నామా? అని నిలదీసేరు. బైంసాలో విలేకరిపై దాడి చేస్తే ఎందుకు మాట్లాడలేదని అడుగుతూ  వీళ్లంతా హిందూ దేవతలను హేళనగా మాట్లాడినప్పుడు ఎక్కడ పోయారని మండిపడ్డారు.