‘శివలింగ’ పూజలపై విచారణ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదిలీ

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్టెక్స్‌లో లభించినట్లు చెబుతున్న శివలింగానికి పూజలు చేయడానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణను జిల్లా కోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బుధవారం బదిలీ చేసింది. ఈ అంశంపై విచారణ మే 30న జరగనున్నది. 
 
జిల్లా కోర్టు జడ్జి ఎకె విశ్వేశ్ ఈ పిటిషన్‌ను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది రాణా సంజీవ్ సింగ్ తెలిపారు. విశ్వ వేదిక్ సనాతన్ సంఘ్ తరఫున ఈ పిటిషన్ దాఖలైంది. సంఘ్ అధ్యక్షుడు జితేంద్ర సింగ్ బిసన్ భార్య, సంఘ్ ప్రధాన కార్యదర్శి కిరణ్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 
 
మసీదు కాంప్లెక్స్‌లోకి ముస్లిం ప్రవేశాన్ని నిషేధించాలని, సముదాయాన్ని తమకు అప్పగించాలని, శివలింగానికి పూజలు చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ఆమె పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. 
 
కాగా..పిటిషనర్ల అభ్యర్థనపై శివలింగానికి పూజల అంశాన్ని బుధవారం విచారిస్తామని కోర్టు తెలిపింది. ఇప్పుడు ఈ అంశంపై విచారణ బాధ్యతను ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదిలీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి-శృంగార గౌరీ కాంప్లెక్సు కేసు విచారణార్హతపై వాదనలను జిల్లా జడ్జి మే 26వ తేదీన వినాలని మంగళవారం నిర్ణయించారు.