చైనీయులకు వీసాలను మంజూరు చేయడానికి సంబంధించిన కుంభకోణం కేసులో మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరంతోపాటు మరి కొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది.
2011 లో కేంద్ర హోం మంత్రిగా పి. చిదంబరం పనిచేసిన కాలంలో ఈ కుంభకోణం జరిగినట్టు ఆరోపించింది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దాఖలు చేసిన కేసు ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) ప్రకారం ఈ కేసును నమోదు చేసింది.
ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సిబిఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈ కేసును నమోదు చేశారు. వేదాంత గ్రూప్ కంపెనీ తల్వండి సబో పవర్ లిమిటెడ్ పంజాబ్‌లో ఓ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేసింది.
ఈ సంస్థకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్ రూ. 50 లక్షలు లంచం కార్తి చిదంబరానికి , ఆయన సన్నిహితుడు ఎస్ భాస్కరరామన్‌కు చెల్లించారు. ఈ నేర ప్రతిఫలంపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తులో భాగంగా నిందితులను ప్రశ్నిస్తుంది. ఇదిలా ఉండగా కార్తి చిదంబరం మాట్లాడుతూ ఈడీ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇవి వేధింపులు కాకపోతే మరేమిటని ప్రశ్నించారు.

More Stories
ప్రసూతి సెలవుపై వెడితే హోదా తగ్గిస్తారా?… రూ. 10 లక్షల జరిమానా
వచ్చే 10 ఏళ్లలో 100 కొత్త విమానాశ్రయాలు
ఇథనాల్ శాతాన్ని వెల్లడించాలని కోరే పిటిషన్ తిరస్కరించిన `సుప్రీం’