ఐఎస్‌బీ విద్యార్థులు దేశానికి గర్వకారణం

ఐఎస్‌బీ ఒక మైలురాయిని దాటిందని పేర్కొంటూ ఐఎస్‌బీ విద్యార్థులు దేశానికి గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ  ప్రశంసలు కురిపించారు. ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవంలో మోదీ ప్రసంగిస్తూ  2001లో నాటి ప్రధాని వాజ్‌పేయ్‌ ఐఎస్‌బీని ప్రారంభించారని గుర్తు చేశారు. 
 
నేడు ఆసియాలోనే ఐఎస్‌బీ టాప్‌ బిజినెస్‌ స్కూల్‌ అని మోదీ పొగడ్తలు కురిపించారు. ఐఎస్‌బీ నుంచి ఇప్పటివరకు 50 వేల మంది బయటకు వెళ్లారని తెలిపారు. ఐఎస్‌బీలో చదివిన వారు విదేశాల్లో ఉన్నత హోదాల్లో ఉన్నారని చెప్పారు. 
 
అనేక స్టార్టప్‌లను ప్రారంభించారని, దేశానికి ఐఎస్‌బీ గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే 25 ఏళ్లకు రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామని చెప్పిన మోదీ అందులో ఐఎస్‌బీ భాగస్వామ్యం వహించాలని చెప్పారు.  “జి20 దేశాల్లో భారత్‌ అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇంటర్నెట్‌  వాడకంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థ దేశంలో ఉంది” అని ప్రధాని గుర్తు చేశారు. 
 
కరోనా సమయంలో దేశం తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చూపిందని చెబుతూ  భారత్‌కు రికార్డుస్థాయిలో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. నేడు భారత్  అంటే బిజినెస్‌ అనేలా పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు.  భారత యువత ప్రపంచానికి నాయకత్వం వహిస్తోందని పేర్కొన్నారు. 
 
మనం చెప్పే పరిష్కారాలను ప్రపంచం అంతా అమలు చేస్తోందని చెబుతూ యువత కోసమే దేశంలో ఎన్నో సంస్కరణలు చేస్తున్నానమని ప్రధాని వెల్లడించారు. యువతతో కలిసి పని చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.  రిఫామ్‌, పెర్ఫామ్‌, ట్రాన్స్‌ఫామ్‌ అందరికీ ముఖ్యం అని స్పష్టం చేశారు. 
 
దేశ పరిపాలన వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చామంటూ స్మార్ట్‌ఫోన్ల వినియోగంలో దేశం మొదటి స్థానంలో ఉందని ప్రధాని తెలిపారు.  “మీ వ్యక్తిగత లక్ష్యాలను దేశ లక్ష్యాలతో జోడించండి. మీ కార్యక్రమాలు దేశానికి ఎలా ఉపయోగపడతాయో ఆలోచించండి’’ అని మోదీ సూచించారు. 
 
ఈ కార్యక్రమంలో గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.