అవసరంలో ఉన్న దేశాల కోసమే గోధుమలపై ఆంక్షలు

అవసరంలో ఉన్న దేశాలకు సాయం చేసేందుకే  తాము గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించామని భారత్ స్పష్టం చేసింది. ‘వసుదైక కుటుంబ’ భావనను కొనసాగిస్తామని వెల్లడించింది. గోధుమల ఎగుమతులపై నిషేధం విధించడాన్ని విమర్శిస్తున్న పాశ్చాత్య దేశాలకు భారత్ గట్టిగా బదులిచ్చింది. 

కరోనా వ్యాక్సిన్ల విషయంలో జరిగినట్లు ఆహార ధాన్యాల విషయంలో జరగకూడదని స్పష్టం చేసింది.  కరోనా వ్యాక్సిన్లను అవసరానికి మించి పాశ్చాత్య దేశాలు నిల్వ చేసుకున్నాయని, ధనిక దేశాల వల్ల పేద దేశాలకు సింగిల్ డోసు వ్యాక్సిన్ కూడా అందలేదని ఈ సందర్భంగా గుర్తు చేసింది. 

రష్యా విషయంలో భారత్  వైఖరిపై తరచూ విమర్శలు చేస్తున్న దేశాలకు వాటి ‘గురువింద గింజ’ నీతిని మరోసారి గుర్తు చేసింది. అమెరికాలో ‘గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ కాల్ టు యాక్షన్’ అంశంపై జరిగిన మంత్రుల సమావేశంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ మాట్లాడుతూ పాశ్చాత్య దేశాల ధోరణులను ఎండగట్టారు.

‘‘ఎన్నో అల్ప ఆదాయ దేశాలు ధరల పెరుగుదల, ఆహార ధాన్యాల కొరత సమస్యలు ఎదుర్కొంటున్నాయి. భారత్ వంటి దేశాల్లో అవసరమైనంత మేరకు నిల్వలు ఉన్నప్పటికీ.. ఆహార ధాన్యాల రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలా అక్రమంగా నిల్వ చేయడం.. సరఫరాపై ఊహాగానాల వల్లే ఇదంతా జరుగుతోంది” అని తెలిపారు. 

దీన్ని ఇలానే తాము కొనసాగనివ్వబోం అని మురళీధరన్ చెప్పుకొచ్చారు. ఆహార ధాన్యాల విషయంలో సమానత్వం.. కొనగలిగే సామర్థ్యం.. అందుబాటులో ఉంచడం అనేవి చాలా ముఖ్యం. అన్ని దేశాలు ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. 

కానీ ఈ సూత్రాలను కరోనా వ్యాక్సిన్ల విషయంలో ఎలా ఉల్లంఘించారో మనం చూశాం అని ఆయన ధ్వజమెత్తారు. ఆపదలో ఉన్న తన భాగస్వామ్య దేశాలకు కరోనా సమయంలోనూ సాయం చేసిన ట్రాక్ రికార్డు భారత్ కు మాత్రమే ఉందని మురళీధరన్ గుర్తు చేశారు.