తన హత్యకు కుట్ర .. ఇమ్రాన్ ఖాన్ ఆరోపణ

తనను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఈ కుట్రలో భాగస్వాముల పేర్లను తాను ఓ వీడియోలో రికార్డు చేశానని, తనకు ఏదైనా జరిగితే ఈ వీడియోను బయటపెడతానని చెప్పారు.
 
సియాల్‌కోట్‌లో  జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ కుట్ర పాకిస్థాన్‌లోనూ, విదేశాల్లోనూ జరుగుతోందని పేర్కొన్నారు.  ‘‘నన్ను హత్య చేయడానికి పాకిస్థాన్‌లోనూ, విదేశాల్లోనూ ఉన్నవారు ప్రయత్నిస్తున్నట్లు నాకు తెలుసు” అని స్పష్టం చేశారు.
“నాకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రకు సంబంధించిన పూర్తి వివరాలతో ఓ వీడియోను రికార్డు చేశాను. దానిని సురక్షిత ప్రదేశంలో భద్రపరిచాను. నన్ను హత్య చేస్తే, ఈ వీడియో బయటపడుతుంది’’ అని ఇమ్రాన్ చెప్పారు. అయితే ఆ కుట్రదారుల పేర్లను ఆయన వెల్లడించలేదు.
ఆ కుట్రదారులు తాను వారికి అడ్డంకిగా ఉన్నట్లు భావిస్తున్నారని, అందుకే తనను అంతం చేయాలనుకుంటున్నారని చెప్పారు. అంతకుముందు శుక్రవారం విలేకర్లతో  ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ అధికారాన్ని దొంగలకు అప్పగించడానికి బదులు ఓ అణుబాంబు వేసి ఉంటే బాగుండేదని చెప్పడం గమనార్హం.
షెహ్‌బాజ్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. దొంగలు పాక్‌ను పాలించడం ఆశ్చర్యం కలిగించే విషయమని, అంతకంటే దేశాన్ని ఒక అణు బాంబు వేసి పాక్‌ను నాశనం చేయడం ఉత్తమం అని పేర్కొన్నారు. ఇతరులపై ఆరోపణలు చేయడం మాని.. ముందు ప్రభుత్వ పని తీరును చక్కబర్చాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని ఉద్దేశించి హితవు పలికారు.
పాక్‌ నిజమైన స్వాతంత్య్రం  కోసం ఈ నెల 20వ తేదీన 20 లక్షల మందితో లాంగ్‌ మార్చ్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీనిని ఏ శక్తీ అడ్డుకోలేదని స్పష్టం చేశారు.  ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్  పాకిస్థాన్ పార్లమెంటులో మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ ప్రజల మనసుల్లో విషం నింపుతున్నారని ఆరోపించారు.