ఆధార్, ఓటర్ ఐడీ లింక్ వద్దనుకుంటే కారణాలు చెప్పాలి

ఓటర్​ ఐడీ కార్డుతో ఆధార్​ను లింక్​ చెయ్యడం, చెయ్యకపోవడం ప్రజల ఇష్టమని, అయితే, లింక్​ చెయ్యొద్దనుకుంటే సరైన కారణాలు చెప్పాల్సి ఉంటుందని ప్రధాన ఎన్నికల ​ కమిషనర్​ (సీఈసీ) సుశీల్​ చంద్ర చెప్పారు. ఓటర్​ ఐడీతో ఆధార్​ను లింక్​ చేసే విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే నిబంధనలు​ వస్తాయని పేర్కొన్నారు. 

ఆదివారం ఆయన సీఈసీగా రిటైర్​ అవుతున్న నేపథ్యంలో ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ తన హయాంలో రెండు ముఖ్యమైన సంస్కరణలను తీసుకొచ్చానని చెప్పారు. ఒకటి ఓటర్​ఐడీకి ఆధార్​ను లింక్​ చెయ్యడం, 18 ఏండ్లు నిండిన యువత ఓటర్​గా నమోదు చేసుకోవడానికి ఒక్క ఏడాదిలో నాలుగు తేదీలను ఖరారు చేయడం వంటి కొత్త నిబంధనల​ను తీసుకొచ్చానని తెలిపారు. 

ఆధార్​ను లింక్​ చేసుకోవడం స్వచ్ఛందమే అయినా  లింక్​ చెయ్యకుంటే ఎందుకు వద్దనుకుంటున్నారో సరైన కారణాలూ ఇవ్వాల్సి ఉంటుందని సుశీల్​ చంద్ర చెప్పుకొచ్చారు. ‘‘ఆధార్​ లేదు, అప్లై చేసినా ఆధార్​ రాలేదు లేదా మరో కారణమేదైనా ఉండొచ్చు. నాకు తెలిసి అంతకు మించిన కారణాలు ఏముంటాయ్​?’’ అని ఆయన ప్రశ్నించారు. 

ఆధార్​ నంబర్లను ఇవ్వడం వల్ల ఎన్నికల సంఘం బోగస్​ ఓటర్లను గుర్తించ గలుగుతుందని పేర్కొన్నారు. అంతేగాకుండా ఓటర్లకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు వీలవుతుందని చెప్పారు. ఓటర్లు నమోదైన బూత్​ల వివరాలు, ఎన్నికలు ఎప్పుడు జరిగేది వంటి వివరాలను వారి ఫోన్​ నంబర్​కే పంపించగలుగుతామని వివరించారు. 

మొన్నటిదాకా ఏటా జనవరి 1నే కొత్త ఓటర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉండేదని సుశీల్​ చంద్ర చెప్పారు. దాని వల్ల ఆ తేదీ తర్వాత 18 ఏండ్లు నిండిన యువత ఓటరుగా నమోదయ్యేందుకు చాలా రోజులు వేచి చూడాల్సి వచ్చేదని తెలిపారు. కానీ, తాను వచ్చిన తర్వాత మరికొన్ని అవకాశాలు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపానని, దానికి ప్రభుత్వం ఒప్పుకొందని చెప్పారు. 

అందులో భాగంగా ఒక ఏడాదిలో నాలుగు తేదీల్లో కొత్త ఓటర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం దొరికిందని తెలిపారు. ఈ సంస్కరణను 20 ఏండ్లుగా పెండింగ్​లో పెట్టారని ఆయన గుర్తు చేశారు. ఇటీవల పార్లమెంట్​లో ప్రవేశపెట్టిన ఆధార్ – ​ఓటర్​ ఐడీ లింకింగ్​ బిల్లులో ఈ నిబంధన కూడా ఉందని చెప్పారు. వీటికి సంబంధించి అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నిబంధనలను విడుదల చేస్తుందని వెల్లడించారు.