`భాగస్వామి’ని మతం మార్చమని వేధించిన యువకుడి అరెస్ట్ 

తమిళనాడులోని తిరుపూర్‌కు చెందిన ఒక వ్యక్తి తాము సన్నిహితంగా ఉన్న  `భాగస్వామి’  చిత్రాలను సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేయడంతో పాటు,  ఆమెను  మతం మార్చడానికి ప్రయత్నించేందుకు క్రూరమైన చర్యలకు గురిచేసినందుకు అరెస్టు చేశారు. 
 
నిందితుడు ఇమాన్ హమీఫ్ (21)పై తిరుపూర్‌లోని నల్లూరు పోలీసులు ఆమె ఫిర్యాదు ఆధారంగా ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం (ఐటి చట్టం) , షెడ్యూల్డ్ కులాలు/ షెడ్యూల్డ్ తెగల అత్యాచారాల నిరోధక చట్టంలోని బహుళ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఎఫ్‌ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) ప్రకారం ఇమాన్ తన భాగస్వామి స్మార్ట్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని,   ఆమె రెండు ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌కు ఆమె ప్రైవేట్ ఫోటోలను పోస్ట్ చేసాడు.  అతను ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా పిలిచి,  ఆమె `సన్నిహితంగా’ ఉన్న చిత్రాలను వాట్సాప్ ద్వారా వారికి ఫార్వార్డ్ చేశాడు. 

 
ఆ మహిళ వాంగ్మూలం ప్రకారం, ఇమాన్ “తన మతంలోకి మారకుంటే మరిన్ని చిత్రాలను పోస్ట్ చేస్తాను” అని బెదిరించాడు. కరూర్‌లో ఆమెతో నివసిస్తున్న 21 ఏళ్ల యువతి ఒకటి కంటే ఎక్కువ సందర్భాల్లో హిజాబ్ ధరించాలని, శుక్రవారం ప్రార్థనలు చేయమని ఆమెను బలవంతం చేసాడు.

ఆ యువతి కరూర్ జిల్లా తిరుమణిలూరుకు చెందగా,  ఆమె ఇమాన్‌తో కలిసి తిరుపూర్‌కు వెళ్లి అక్కడ బనియన్ల తయారీ యూనిట్‌లో ఉద్యోగం సంపాదించింది. తన ఫిర్యాదులో, “ఇమాన్ మొదట్లో వెంటనే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టాడు. మేము నిక్కా (ఇస్లాం మతం వివాహం) చేస్తాము.  అతను నన్ను మదర్సా (ఇస్లామిక్ పాఠశాల)లో చేర్పిస్తానని చెప్పాడు. అందుకు  నేను ప్రతిఘటించాను” అని పేర్కొన్నది.

ఇమాన్ తాగి ఇంటికి వచ్చి కొట్టేవాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు తన తండ్రికి అనారోగ్యంగా ఉందని అంటూ ఆమె బంగారు చెవిపోగులను కూడా తాకట్టు పెట్టినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

శారీరక వేధింపులు,మతం మారడానికి మానసిక ఒత్తిడితో పాటు, అట్టడుగు వర్గానికి చెందిన తనను ఇమాన్   అవమానించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నది.  “నేను నా విశ్వాసాన్ని మార్చుకోవడానికి నిరాకరించినప్పుడు, అట్టడుగు వర్గానికి  చెందిన నాకు అంత గర్వం ఎందుకు అని అతను నన్ను అడిగాడు?” అంటూ ఆమె తెలిపింది.

మే 5, 2022న ఆమె ఫిర్యాదు ఆధారంగా తిరుపూర్‌లోని నల్లూరు పోలీస్ స్టేషన్ ఇమాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, మే 11న ఇమాన్‌ను పోలీసులు అరెస్టు తిరుపూర్ జిల్లా జైలుకు రిమాండ్ కు పంపారు.