హిమాచల్ లో దాడులు… సీఎంకు సిఖ్ ఉగ్రవాదుల హెచ్చరిక

నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ ఎఫ్ జె) వ్యవస్థాపకుడు గుర్‌పత్వంత్ సింగ్ పన్ను ఓ ఆడియో మెసేజ్‌ ద్వారా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్‌ను హెచ్చరించాడు. పంజాబ్‌లోని పోలీసు ఇంటెలిజెన్స్ వింగ్ హెడ్‌‌క్వార్టర్స్‌పై గ్రెనేడ్ దాడి జరిగినట్లుగానే సిమ్లాలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌పై కూడా దాడి జరుగుతుందని పేర్కొన్నాడు. 

పంజాబ్‌  లోని మొహాలీలో ఉన్న పోలీసు ఇంటెలిజెన్స్ వింగ్ ప్రధాన కార్యాలయంపై ఇటీవల గ్రెనేడ్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్‌ లోని ధర్మశాలలో ఉన్న శాసన సభ భవనం ప్రధాన ద్వారానికి ఖలిస్థానీ జెండాలను కట్టారు.

ఈ నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న ఎస్ఎఫ్‌జే వ్యవస్థాపకుడు సింగ్ ఓ ఆడియో మెసేజ్‌ను విడుదల చేశాడు. ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.  శాసన సభ ప్రధాన గేట్లకు ఖలిస్థాన్  జెండాలను కట్టిన సంఘటనకు తానే బాధ్యుడినని ఈ మెసేజ్‌లో చెప్పినట్లు కనిపిస్తోంది.

గతంలో అనేక సమస్యలు సృష్టించిన ఖలిస్థాన్ ఉద్యమాన్ని తిరిగి లేవనెత్తడానికి సింగ్ ప్రయత్నిస్తున్నాడు. పంజాబ్ రిఫరెండం, 2020ని నిర్వహించాడు.  బియాంత్ సింగ్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషిని జైలు నుంచి విడుదల చేయాలని ప్రచారం చేస్తున్నాడు.

ఇదిలావుండగా, ఎస్ ఎఫ్ జె ను 2019లో కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం ఈ సంస్థపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది.  పంజాబ్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ, ఉగ్రవాద సిద్దాంతాలను ప్రచారం చేస్తున్నందుకు ఈ చర్య తీసుకుంది. విదేశాల్లోని భారత దేశ శత్రువుల మద్దతు ఈ సంస్థకు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.