క్రిమినల్స్‌ కన్నా హీనంగా చూశారని నవనీత్ ఫిర్యాదు

మహారాష్ట్ర పోలీసులు తమ పట్ల అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఎంపీ నవనీత్‌ రాణా (స్వతంత్ర) సోమవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఒక కేసులో తనతో పాటు, ఎమ్మెల్యే అయిన భర్త రవి రాణాను అరెస్టు చేసిన పోలీసులు లాక్‌పలోనూ, జైలులోనూ అమర్యాదకరంగా వ్యవహరించారని తెలిపారు. 
 
క్రిమినల్స్‌ కన్నా హీనంగా చూశారని అంతకుముందు ముంబైలో జరిగిన మీడియా సమావేశంలోనూ ఆరోపించారు. నవనీత్‌ రాణా మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా, ఆమె భర్త రవి అమరావతి జిల్లా బడ్నేరా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఆ దంపతులిద్దరూ స్పీకరుతో 45 నిమిషాలు సమావేశమై జరిగిన సంఘటనలను వివరించారు. 
 
ఈ నెల 23న తన ఫిర్యాదును లోక్‌సభ హక్కుల కమిటీ పరిశీలిస్తుందని, తాను లిఖితపూర్వక స్టేట్‌మెంట్‌ సమర్పిస్తానని ఆమె చెప్పారు. ఆమె అరెస్టుపై వాస్తవాలు పంపించాలని ఇప్పటికే లోక్‌సభ కార్యాలయం కేంద్ర హోం శాఖ ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రికి కూడా ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు.
 
మరోవంక, హనుమాన్ చాలీసా ఛాలెంజ్ విషయమై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇంటి వద్ద ఆందోళన చేబడతామని అంటూ మత ఉద్రిక్తలు కలిగించే విధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన కేసులు వారు బెయిల్ పై బైటకు వచ్చారు. అయితే కోర్ట్ వారికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఈ సంఘటనపై మీడియాతో మాట్లాడవద్దని ఓ షరతు విధించింది. 
 
కానీ, వరుసగా మీడియాతో మాట్లాడుతూ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ, మత ఉద్రిక్తలు కలిగే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ వారి బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. వారి మీడియా సమావేశాల వీడియోలను కూడా కోర్టుకు సమర్పించారు.