మచిలీపట్నంపైపు దూసుకొస్తున్న తుఫాను ‘అసాని’

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ‘అసాని’ మచిలీపట్నంపైపు దూసుకొస్తోంది.  ఉత్తర కోస్తా- ఒడిశా మధ్యలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసిన సంగతి తెలిసిందే.  ఈ  తుఫాను కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం వైపు  దూసుకువస్తుందని తెలిపింది.  ఇప్పటికే ఎపిలోని విశాఖ పట్నం పోర్ట్‌ను మూసివేశారు.

బుధవారం సాయంత్రలోపు మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకి మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశముందని ఐఎండి అంచనా వేస్తోంది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఈ తుపాను కారణంగా ఈ రోజు రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, ఒడిశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాన్ హెచ్చరికల అధికారి జగన్నాథ కుమార్ సూచించారు.

ఈ తుపాను కారణంగా మే 10న చెన్నై, విశాఖపట్నంలో పలు విమానయాన సంస్థలతో వివిధ విమాన కార్యకలాపాలను రద్దు చేసినట్లు ఏమియేషన్‌ అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా 23 ఇండిగో విమానాలు రాకపోకలను రద్దు చేసినట్లు విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అంతేకాదు నాలుగు ఎయిర్‌ఏషియా విమానాలు కూడా రద్దు చేసినట్లు కూడా వెల్లడించారు.

తుపాను ప్రభావం తెలంగాణపైనా పడే అవకాశముంది. రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.  బుధవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. గంటకు 30 నుంచి 40కి.మీ.ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.