శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ… కార్మికుల భారీ నిరసన

శ్రీలంకలో అధ్యక్షుడు గొటబయా రాజపక్స అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) మరోసారి ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఇది అమలులోకి వచ్చింది. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న లంక గడ్డపై ఐదు వారాల్లో రెండోసారి ఇది ఎమర్జెన్సీ ప్రకటించడం. 
 
ఎమర్జెన్సీ ద్వారా పోలీసులకు, భద్రతా సిబ్బందికి ప్రత్యేక అధికారాలు సంక్రమిస్తాయి. ఎవరినైనా నిర్బంధించేందుకు, అరెస్టు చేసేందుకు వీలుంటుంది. అధ్యక్షుడు గొటబయా  గొటబయా రాజపక్స తక్షణం రాజీనామా చేయలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించడం గమనార్హం.
మరోవైపు గోటబయా రాజీనామాను డిమాండ్‌ చేస్తూ వేల మంది విద్యార్థులు పార్లమెంట్‌ ముట్టడికి ఉపక్రమించారు. ఈ క్రమంలో పోలీసులు, భద్రతా సిబ్బంది టియర్‌గ్యాస్‌ ప్రయోగం, లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం.
ఇంకోపక్క.. అధ్యక్షుడి రాజీనామాను డిమాండ్‌ చేస్తూ శ్రీలంకలో శుక్రవారం భారీ సమ్మె జరిగింది. దేశ వ్యాప్తంగా 2 వేలకుపైగా కార్మికసంఘాలు ఈ సమ్మెలో భాగస్వామ్యమైనాయి. ఆరోగ్యం, పోస్టల్‌, పోర్టులతో పాటు ఇతర ప్రభుత్వ రంగాలకు చెందిన సంఘాలు, ఉద్యోగులు సమ్మెలో పాలుపంచుకున్నారు. 
 
దీంతో శ్రీలంక స్థంభించింది. సమ్మె సందర్భంగా అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో జరిగిన ప్రదర్శనల్లో వేలాది మంది స్థానిక ప్రజలు పాలుపంచుకున్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన అధ్యక్షుడు రాజపక్సాతో పాటు ఆయన ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేయాలని ప్రదర్శనల్లో పాల్గొన్నారు.  అనూహ్యమైన రీతిలో దేశం ఎదుర్కొంటును ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజలు పడుతును ఇబ్బందులను పరిష్కరించలేనిప్రభుత్వానికి అధికారంలో ఉండే హక్కు లేదనిపలు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. 
 
అధ్యక్షుడి వ్యతిరేక నినాదాలు దేశ వ్యాప్తంగా మారుమ్రోగాయి. జన జీవనం స్తంభించింది. వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. దాదాపుగా రైలు సర్వీసులన్నీ రద్దు చేయబడ్డాయి. ప్రైవేట్ యాజమాన్యంలోని బస్సులు రోడ్లపైకి రాలేదు, పారిశ్రామిక కార్మికులు తమ ఫ్యాక్టరీల వెలుపల ప్రదర్శనలు చేశారు. అప్పుల ఊబిలోకి నెట్టేసిన చేతకానీ ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా నల్లజెండాలు ఎగరేశారు