కోల్‌కతాలో బిజెపి కార్యకర్త మృతిపై సిబిఐ దర్యాప్తు..  అమిత్ షా

నార్త్ కోల్‌కతాలోని ఘోష్ భవన్ ప్రాతంలో బీజేపీ యువమోర్చా కార్యకర్త హత్యపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా డిమాండ్ చేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమబెంగాల్ వచ్చిన అమిత్‌షా ఈ ఘటనపై మమతా బెనర్జీ సారథ్యంలోని బెంగాల్ ప్రభుత్వాన్ని నివేదిక కోరారు. 
 
27 ఏళ్ల అర్జున చౌరాసియా నార్త్ కోల్‌కతాలోని ఘోష్ భగన్ ప్రాంతంలోని ఓ పాడుబడిన ఇంట్లో శుక్రవారం ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో  కనిపించాడు.  “మృతుని కుటుంబ సభ్యులతో నేను మాట్లాడాను. తమను కూడా కొట్టినట్టు వారు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోర్టును బీజేపీ ఆశ్రయించనుంది. దీనిపై సీబీఐ దర్యాప్తు జరగాలని నేను అభిప్రాయపడుతున్నాను” అని అమిత్‌షా పేర్కొన్నారు.
బెంగాల్‌లో హింస సంస్కృతి, భయానక వాతావరణం  ప్రబలంగా నెలకొందని  అమిత్ షా మండిపడ్డారు. “నిన్ననే టిఎంసి మూడవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంది.  ఇప్పుడు చౌరాసియాను చంపిన సందర్భం ఉంది” అని హోం మంత్రి మరణించిన వారి కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత విలేకరులతో తెలిపారు.  చౌరాసియా మృతిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీరియస్‌గా వ్యవహరిస్తోందని, దీనిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినదని ఆయన వెల్లడించారు.
మరోవైపు, ఈ హత్యకు అధికార తృణమూల్ కాంగ్రెస్ కారణమని బీజేపీ ఆరోపించింది. చౌరాసియా సమర్ధుడైన పార్టీ కార్యకర్త అని బీజేపీ ప్రతినిధి సమిక్ భట్టాచార్య తెలిపారు. భట్టాచార్య మృతి వార్తతో అమిత్‌షా చాలా మనస్తాపం చెందారని, ఎన్‌ఎస్‌సీ బోస్ విమానాశ్రయంలో తన స్వాగతానికి ఎలాంటి ఏర్పాట్లు చేయవద్దని కూడా అమిత్‌‌షా తమకు సూచించారని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
కోల్‌కతా విమానాశ్రయం నుంచి అమిత్‌షా నేరుగా చౌరాసియా నివాసానికి చేరుకుని అతని కుటుంబ సభ్యులను కలిశారు. అనంతరం మీడియాతో అమిత్‌షా మాట్లాడుతూ, ఇటీవల పలు కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు కోల్‌కతా హైకోర్టు  ఆదేశించిందని చెప్పారు. దీనిని  బట్టే రాష్ట్ర ప్రజలు కానీ, న్యాయవ్యవస్థ కానీ  రాష్ట్ర యంత్రాంగం, పోలీసులపై విశ్వాసం కోల్పోయిన విషయం అవగతమవుతోందని ధ్వజమెత్తారు.
హింసాత్మక ఘటనల్లో గత లెఫ్ట్ ఫ్రెంట్ ప్రభుత్వాన్ని కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మించిపోయిందని అమిత్ షా  విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం చట్టబద్ధ పాలన సాగడం లేదని మండిపడ్డారు.  విపక్ష నేతలు, కార్యకర్తలను అధికార పార్టీ, ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం లక్ష్యంగా పెట్టుకుంటుందని చెప్పారు.