గ్రూప్-1 లో ఉర్థు పరీక్ష వెనుక మహా కుట్ర

గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రూప్-1 పరీక్షను ఉర్ధూలో రాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం వెనుక మహా కుట్ర దాగి ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. దీనివల్ల ఒక వర్గం వారికే ఉన్నత ఉద్యోగాలు పొందుతారని, హిందూ సమాజానికి భవిష్యత్తులో ఆయా ఉద్యోగాలు పొందే అవకాశం కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
 
ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా 20వ రోజున దేవరకద్రలో గత రాత్రి జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం ఎంఐఎం చేతుల్లో పెట్టేందుకు కుట్ర జరుగుతోందని సంజయ్ ధ్వజమెత్తారు.  ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించేదాకా బీజైవైఎం ఆధ్వర్యంలో మహా పోరాటం చేయబోతున్నట్లు సంజయ్  ప్రకటించారు.
 సీఎం కేసీఆర్‌ కుట్రపై బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్‌ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా హిందూ యువత తరఫున  తాము పోరాడతామని, యువత కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ భాషలకు బీజేపీ వ్యతిరేకంకాదని, కానీ మత ప్రాతిపదికన ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే సహించేదిలేదని హెచ్చరించారు.
కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లా పూర్తిగా వెనుకబడిందని ధ్వజమెత్తుతూ  సీఎంకు చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే పాలమూరు జిల్లాకు నిధుల కేటాయింపుపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన  డిమాండ్ చేశారు.

‘‘కేసీఆర్…. పాలమూరు పచ్చబడ్డది. వలసలు లేవన్నవ్ కదా! భీవండి, ముంబయి పోయినోళ్లంతా తిరిగొస్తున్నరని చెప్పినవ్ కదా!. పాలమూరులో వలసలున్నయని నేను నిరూపిస్తా,  నిరూపించలేని పక్షంలో నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.  నిరూపిస్తే నువ్వు, నీ కుటుంబం రాజకీయాలను వదిలేసి తెలంగాణ నుండి వెళ్లిపోయేందుకు సిద్ధమా?’’అని సంజయ్ కేసీఆర్ కు సవాల్ విసిరారు. 

పాలమూరు అభివృద్ధి కి బీజేపీ కట్టుబడి ఉందని చెబుతూ  బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు ను పచ్చబడేస్తామని, ఇక్కడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  ఆర్డీఎస్ పనులకు పరిష్కారం చూపించామని చెబుతూ  జీవో 69 కి అనుగుణంగా ఇక్కడి ప్రాజెక్టులు పూర్తిచేస్తామని ప్రకటించారు. పాలమూరు గడ్డపై మాకు అవకాశం ఇస్తే… పాలమూరు ను సస్యశ్యామలం చేస్తాం అని సంజయ్ స్పష్టం చేశారు.

దేవరకద్రలో ఒక్క డిగ్రీ కాలేజ్ కూడా లేదని చెబుతూ కనీసం ఆర్ఓబిని  కూడా పూర్తిచేయలేదని విమర్శించారు.  కేసీఆర్ పేరు చెప్తేనే… కాంట్రాక్టర్లు భయపడుతున్నారని, దేశం విడిచిపోతున్నరని ఎద్దేవా చేశారు. చెక్ డ్యామ్ ల పేరుతో ఒకడు రూ.120 కోట్లు, ఇసుక పేరుతో ఇంకోడు రూ.100 కోట్లు సంపాదించారని ఆరోపించారు. 

 
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ… రెండూ ఒకటే అని స్పష్టం చేస్తూ రెండు పార్టీలు కలిసే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నాయని సంజయ్ జోస్యం చెప్పారు.
 
కాగా, రాహుల్‌ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలోకి రావాలంటే తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1,200 మంది కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బలపడిందనే సంకేతాల నేపథ్యంలోనే రాహుల్‌ ఓయూ పర్యటన తెరమీదకు తెచ్చారని ఆయన దుయ్యబట్టారు. పాలమూరులో గెలిచిన ఒక్క ఎమ్మెల్యేను నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్‌ గురించి ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.