ముగ్గురు ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లో పట్టివేత

ముగ్గురు ఉగ్రవాదుల‌ను జ‌మ్మూక‌శ్మీర్ పోలీసులు ప్రాణాల‌తో ప‌ట్టుకున్నారు. వీరు ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన వారు. ఉత్తర కశ్మీర్ లోని సోపోర్ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 
 
ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ఇటీవల స్థానికేతర కార్మికులను చంపడం, వివిధ ప్రాంతాల్లో గ్రెనేడ్లు విసిరి అలజడి సృష్టించడం వెనుక లష్కరే తోయిబా హస్తం ఉందనే విషయం విచారణలో తేలిందని పేర్కొన్నారు. వీటికి సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 
 
పండ్ల తోటల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా వీరిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. పక్కా ప్రణాళికతో వీరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వీరి వద్ద నుంచి మూడు చైనీస్ తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
 
అరెస్టయిన ముగ్గురు ఉగ్రవాదుల పేర్లు:  తఫీమ్ రియాజ్, సీరత్ షాబాజ్ మీర్ , రమీజ్ అహ్మద్ ఖాన్. విజయవంతమైన ఈ ఆపరేషన్ తీవ్రవాద కుట్రను భగ్నం చేయడంలో సహాయపడుతుందని,  స్థానికేతర కార్మికులను లక్ష్యంగా చేసుకుని హత్య చేయడం వెనుక ఉన్న మాడ్యూల్‌ను బహిర్గతం చేయడంలో సహాయపడుతుందని భద్రతా దళాలు పేర్కొన్నాయి.
 
గందేర్ బల్ ప్రాంతంలో కూడా ఒక స్కార్పియో వాహనంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 
మరోవైపు బారాముల్లా జిల్లాలో ఇంట‌ర్ డిస్ట్రిక్ట్ నార్కో టెర్ర‌ర్ మాడ్యూల్‌ను జ‌మ్మూక‌శ్మీర్ పోలీసులు ఛేదించారు. ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను అరెస్టు చేశారు. ఆ ఇద్ద‌రి నుంచి రూ. 1.5 కోట్ల విలువ చేసే హెరాయిన్‌తో పాటు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై యూఏపీ యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.