నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌గా సుమన్‌ బేరీ

నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌గా ప్రముఖ ఆర్థికవేత్త సుమన్‌ బేరీ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. రాజీవ్‌ కుమార్‌ స్థానంలో ఆయన నూతన వీసీగా నియమితులయ్యారు. బేరీ గతంలో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లెడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ (చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌)గా, రాయల్‌ డచ్‌ షెల్‌ గ్లోబల్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌గా పని చేశారు.

ఆయన  ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి, స్టాటిస్టికల్‌ కమిషన్‌, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్రవ్య విధానానికి సంబంధించిన సాంకేతిక సలహా కమిటీలో కూడా సభ్యుడు. ప్రపంచబ్యాంకుకు కూడా బేరీ సేవలు అందించారు. కేంద్రం తనకు అప్పగించిన ఈ బాధ్యతలను గౌరవంగా భావిస్తున్నట్టు బేరీ వివరించారు.

దేశ ఆర్థిక వృద్ధిలో నీతి ఆయోగ్‌ తనదైన పాత్ర పోషించేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. అరవింద్‌ పనగారియా స్థానంలో రాజీవ్‌ కుమార్‌ 2017లో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

కాగా, ఆదివారం నూతన విదేశాంగ కార్యదర్శిగా వినయ్‌ క్వాత్ర బాధ్యతలు స్వీకరించారు. హర్షవర్ధన్‌ శ్రీంగ్లా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. వినయ్‌ క్వాత్రా.. భారత విదేశాంగ శాఖ 34వ కార్యదర్శి. ప్రధాని మోదీ ఐరోపా  పర్యటనకు ఒక రోజు ముందే వినయ్‌ క్వత్రా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.