చల్లబడుతున్న ఢిల్లీ ప్రాంతం, బెంగుళూరులో భారీ వర్షం!

కొద్ది  రోజులుగా మండుటెండలతో దేశం అంతటా ప్రజలు విలవిలలాడుతుంటే ఢిల్లీ వైపు వాతావరణం చల్లబడుతున్నట్లు వాతావరణ శాఖ  చెప్పగా, బెంగుళూరులో భారీ వర్షం కురుస్తున్నది. 
 
 నేటి నుండి ఢిల్లీ, వాయువ్య, మధ్య భారత్‌లో పరిసర ప్రాంతాల్లో వడగాల్పులు తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా-చండీఘర్‌, తూర్పు రాజస్తాన్‌, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం ఉరుములు, మెరుపుతో కూడిన వర్షాలు పడవచ్చునని వాతావరణ కార్యాలయం అంచనా వేసింది.
 మే 3 నుండి మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, తెలంగాణ, పశ్చిమ రాజస్తాన్‌లలో వేడిగాలులు తగ్గుతాయని ఐఎండి తెలిపింది. వాయువ్య, మధ్య భారత దేశంలో 122 సంవత్సరాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ ఏప్రిల్‌లోనే నమోదయ్యాయని తెలిపిన సంగతి విదితమే. 
 
సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 35.9, 37.78 డిగ్రీల సెల్సియస్‌ చేరుకున్నాయని పేర్కొంది. అంటే ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలున్నాయో అర్ధమౌతోంది. 2010 ఏప్రిల్‌లో వాయువ్య ప్రాంతంలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 35.4 డిగ్రీలు కాగా, 1973లో మధ్య ప్రాంతంలో 37.75 డిగ్రీలు నమోదైంది.
 
మరోవైపు బెంగళూరులో ఆదివారం ఉదయం విపరీతమైన ఎండ తీవ్రత కనిపించగా,  సాయంత్రం అయ్యే సరికి వాన వర్షం ప్రారంభమైంది. బెంగళూరు సహా కోలారు, కొడగు, మైసూరు జిల్లాల్లో భారీ వర్షం పడింది. పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన పడడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.

బెంగళూరులో సుమారు 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురు గాలుల వర్షానికి బెంగళూరులోని పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. డ్రైనేజీ కాల్వలు నిండిపోయి.. రోడ్లపై నీరు నిలిచిపోయింది. మున్సిపల్ అధికారులు అప్రమత్తం అవడంతో.. ఇళ్లల్లోకి నీరు చేరలేదు. 

బెంగళూరులో భారీ వర్షాలు పడటంతో.. బృహత్ బెంగళూరు మహానగర్ పాలికె అధికారులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో విరిగి పడిన చెట్ల కొమ్మలను అధికారులు తొలగించారు. లోతట్టు ప్రాంతాలపై దృష్టి నిలిపి, సహాయ చర్యలు చేపట్టేందుకు బృందాలను పంపారు. మరోవైపు ఎడతెగని విద్యుత్ కోతలతో బెంగళూరు వాసులు ఇబ్బందులు పడుతున్నారు.

వర్షం వల్ల ఇబ్బందులు కలిగితే సంప్రదించేందుకు హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు బెంగళూరు అధికారులు. చెట్ల కింద నిలబడడం, వాహనాల్లో సంచరించడం తగదని అధికారులు సూచించారు. మరో మూడు రోజుల పాటు బెంగళూరులో  భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. కర్ణాటక తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ.