బూస్టర్‌ డోస్‌ కు ఖచ్చితంగా 9 నెలల కాల వ్యవధి

ముందు జాగ్రత్తగా బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా 9 నెలల కాల వ్యవధి ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభంలో ప్రికాషన్‌ డోస్‌ పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే.

మొదట రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్న వారు 9 నెలలకు బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని కేంద్రం వెల్లడించింది. అయితే ఈ కాల వ్యవధిని తగ్గించాలని గతంలో ప్రతిపాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రికాషన్‌ డోస్‌ కాలవ్యవధిని కేంద్రం తగ్గించనున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ వార్తలపై తా జాగా కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు స్పందించాయి. కాల వ్యవధిని తగ్గించలేదని, రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాతే ముందు జాగ్రత్తగా బూస్టర్‌ డోసు వేయించుకోవాలని మరోసారి స్పష్టం చేశాయి.

జనవరి 10 నుంచి దేశంలో మూడో డోసు పంపిణీ ప్రారంభమైంది. తొలి దశలో.. ఆరోగ్య కార్యకర్తలకు, 60 ఏళ్ల వయసుదాటిన వారికి.. ఇతర అనారోగ్య సమస్యలతో భాపడుతున్న వృద్ధులకు ప్రికాషన్‌ డోసు అందించారు. అయితే ఏప్రిల్‌ 10 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరూ ప్రికాషన్‌ డోసు వేయించుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ప్రైవేటు కేంద్రాల ద్వారా ఈ డోసును పంపిణీ చేస్తున్నారు.

మరోవంక, దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3324 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,79,188కి చేరాయి. ఇందులో 4,25,36,253 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో దేశంలో 40 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,23,843కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 19,092 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అదే సమయంలో 2876 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.