బొగ్గు సరఫరాకోసం 42 ప్యాసింజర్‌ రైళ్ల రద్దు

దేశంలో బొగ్గు సరఫరాను వేగవంతం చేసేందుకు 42 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. విద్యుత్‌ ప్లాంట్‌లలో బొగ్గు కొరత తలెత్తిందంటూ పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో బొగ్గు కొరతను పరిష్కరించేందుకు, బొగ్గు సరఫరాను  వేగవంతం చేస్తున్నామని ఇండియన్‌ రైల్వే ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గౌరవ్‌ కృష్ణ బన్సాల్‌ వెల్లడించారు. 
 
బొగ్గు రవాణా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా 42 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ రైళ్ల రద్దు తాత్కాలికమేనని, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత వీటిని తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పారు.  స్థానిక ఎంపిల ఆందోళనలతో రద్దు చేసిన మూడు చత్తీస్‌ఘర్‌ రైళ్లను పునరుద్ధరించారు. 
 
కీలకమైన పవర్‌ప్లాంట్‌లలో 21 రోజుల పాటు ఉండాల్సిన బొగ్గు నిల్వలు ఒక రోజు కంటే తక్కువగా ఉన్నాయని, దీంతో బొగ్గు కొరత ఏర్పడనుందని ఢిల్లీ విద్యుత్‌ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ పేర్కొన్నారు.  ఢిల్లీకి   విద్యుత్తును సరఫరా చేస్తున్న ఐదు విద్యుదుత్పత్తి కర్మాగారాల్లో రెండిటిలో బొగ్గు కేవలం ఒకటి లేదా రెండు రోజులకు సరిపడినంత మాత్రమే ఉందని తెలిపారు. 
ప్రభుత్వ ఆస్పత్రులు, మెట్రో వంటి సేవలకు విద్యుత్‌ కోతలు తలెత్తవచ్చని వ్యక్తం చేస్తూ బొగ్గు సరఫరాను పెంచాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. ఈ పరిస్థితిని పరిష్కరిచేందుకు కేంద్రం తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవరసం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.
 
కాగా, విద్యుదుత్పత్తి కర్మాగారాల్లో రెండు రోజులకు సరిపోయే బొగ్గు మాత్రమే అందుబాటులో ఉందని ఢిల్లీ ప్రభుత్వం చెప్తుండటంపై నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) స్పందిస్తూ దాద్రి-2, ఊంచహార్ పవర్ ప్లాంట్స్‌కు క్రమబద్ధంగా నిత్యం బొగ్గు సరఫరా అవుతోందని, ఈ రెండూ పరిపూర్ణ సామర్థ్యంతో పని చేస్తున్నాయని స్పష్టం చేసింది. 


ఎన్‌టీపీసీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో, ప్రస్తుతం ఊంచహార్, దాద్రి స్టేషన్లు గ్రిడ్‌కు 100 శాతం కన్నా ఎక్కువ రేటెడ్ కెపాసిటీని తెలియజేస్తున్నాయని తెలిపింది. ఊంచహార్ యూనిట్-1 మినహా ఊంచహార్, దాద్రిలోని అన్ని యూనిట్లు పరిపూర్ణ లోడ్ కెపాసిటీతో పని చేస్తున్నట్లు తెలిపింది. 

 
ఊచహార్ యూనిట్ 1లో ప్రణాళిక ప్రకారం వార్షిక ఓవర్‌హాల్ జరుగుతోందని పేర్కొంది. దాద్రిలో ఆరు యూనిట్లు ఉన్నాయని, ఇవన్నీ సంపూర్ణ సామర్థ్యంతో పని చేస్తున్నాయని తెలిపింది. అదేవిధంగా ఊంచహార్‌లో ఐదు యూనిట్లు సంపూర్ణ సామర్థ్యంతో పని చేస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం దాద్రి స్టేషన్‌లో 1,40,000 ఎంటీలు, ఊంచహార్‌లో 95,000 ఎంటీల బొగ్గు ఉందని తెలిపింది.