మోదీని ఉద్దేశించి `జుమ్లా’ పదజాలంపై నిలదీసిన ఢిల్లీ హైకోర్టు!

మోదీని ఉద్దేశించి `జుమ్లా’ పదజాలంపై నిలదీసిన ఢిల్లీ హైకోర్టు!
ప్రభుత్వంపై విమర్శలకు కూడా ఓ హద్దుండాలని ఢిల్లీ హైకోర్టు హితవు చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్ధేశించి `జుమ్లా’ (అబద్ధాలకోరు) అనే పదజాలాన్ని వినియోగించడం సరైనదేనా? అంటూ విద్యార్థి నేత ఉమర్‌ ఖలీద్‌ను ప్రశ్నించింది. విమర్శకు పరిమితి లేదా లక్ష్మణ రేఖ ఉండాలని హితవు చెప్పింది. 
 
ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ట్రయిల్‌ కోర్టు బెయిల్‌ తిరస్కరించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణను కొనసాగించింది. విచారణ సందర్భంగా.. 2020  ఫిబ్రరిలో అమరావతిలో ఖలీద్‌ చేసిన ప్రసంగానికి చెందిన వీడియోను ప్లే చేశారు. అనంతరం ఈ ప్రసంగం ఆక్షేపణీయమైనదని హైకోర్టు స్పష్టం చేసింది. 
 
ప్రసంగం ప్రాథమికంగా “అసహ్యకరమైనది”,  “ఆక్షేపణీయమైనది” అని బెంచ్ పేర్కొన్నది.  అమరావతిలో ఉమర్ ఖలీద్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం, అసహ్యకరమైనవిగా ఉన్నాయని బెంచ్ గతంలో ఏప్రిల్ 22న పేర్కొంది.
 
 “గాంధీజీ ఈ భాషను ఉపయోగించింది నిజమేనా? షహీద్ భగత్ సింగ్ ఎప్పుడూ అలాంటి భాషను ఉపయోగించాడనేది నిజమేనా? భావ ప్రకటన స్వేచ్ఛను అనుమతించడంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు, కానీ మీరు సరిగ్గా ఏమి చెప్తున్నారు?” అంటూ ప్రశ్నించింది.

గత నెలలో, ఖలీద్‌కు అదనపు సెషన్స్ జడ్జి అమితాబ్ రావత్ బెయిల్ నిరాకరించారు, అతనిపై అభియోగాలు ప్రాథమికంగా నిజమని నమ్మడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు.

 
కాగా, ఖలీద్‌ తరుపున వాదించిన సీనియర్‌ అడ్వకేట్‌ త్రిదీప్‌ పైస్‌ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు ఉద్దేశించి  ప్రసంగించారని, దీన్ని పరుష పదజాలం వినియోగించడం చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) కింద నేరంగా పరిగణించబడదని తెలిపారు.
 
 ‘ప్రధానినుద్ధేశించి `జుమ్లా’ అనే పదం వినియోగించడం సరైందేనా..?’ అని జస్టిస్‌ రజనీస్‌ భట్నాకర్‌, జస్టిస్‌ సిద్ధార్ధ్‌ మృదుల్‌ నేతృత్వంలోని ధర్మాసనం త్రిదీప్‌ను ప్రశ్నించగా,  ఇదేమీ నేరం కాదని పేర్కొన్నారు.
 కాగా, ‘చంగా’ అనే పదాన్ని వినియోగించడంపై కూడా ప్రశ్నించింది. దానిపై వివరణనిచ్చిన త్రిదీప్‌..  ఈ వ్యాఖ్యలతో ఓ వ్యక్తిని యుఎపిఎ కింద అమానుషంగా 583 రోజుల పాటు జైలులో ఉంచడం సరికాదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కోర్టు.. విమర్శలకు కూడా ఓ పరిమితి ఉండాలని స్పష్టం చేసింది.

యాదృచ్ఛికంగా, జమ్ముకాశ్మీర్‌ హైకోర్టు కూడా ఓ కేసులో ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది . భావ ప్రకటనా స్వేచ్ఛకు కూడా లక్ష్మణ రేఖ అవసరమని పేర్కొంది. భారత్‌లో తానొక బానిసగా బ్రతుకున్నానని, కాశ్మీర్‌ను సైనికులు ఆక్రమణకు గురిచేస్తున్నారన్న ఆరోపణలపై యుఎపిఎ కింద అరెస్టు చేసిన ఓ లాయర్‌ పిటిషన్‌పై జమ్ముకాశ్మీర్‌ హైకోర్టు ఇదే రకమైన వ్యాఖ్యలు చేసింది.