12 రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా ఉధృతి

 భారత్ లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. చాపకింద నీరులా రోజురోజుకూ విస్తరిస్తోంది. స్వల్ప హెచ్చు తగ్గులతో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 2 వేలకు పైగానే నమోదవుతుండడం ఆందోళన కల్గిస్తోంది. గత వారం రోజుల నుంచి 12 రాష్ట్రాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 
 
గత వారంతో పోలిస్తే కేసుల సంఖ్య దాదాపు రెట్టింపవ్వడం కలవరపెడుతోంది. కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండడంతో క్రియాశీల కేసుల సంఖ్య 16 వేలు దాటింది. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 3.02 లక్షల మందికి వైరస్ పరీక్షలు చేయగా. 2,541మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.84 శాతంగా ఉంది.
గత 24 గంటల్లో 1,862 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 16,522 మందికి పైగా కరోనాతో బాధపడుతుండగా.. యాక్టివ్ కేసుల రేటు 0.04 శాతంగా ఉంది.  నిన్న మరో 30 మంది  తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 5,22,223 మందిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది.
మరోవైపు భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 3.64 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటి వరకు 187 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇలా ఉండగా,  రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో తమిళనాడు తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి విధిగా కరోనా పరీక్షలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ సెల్వ వినాయగం అన్ని జిల్లాల ఆరోగ్య శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.
 
రోడ్డు మార్గం లేదా బస్సుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పకుండా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, సరిహద్దుల్లో కరోనా పరీక్షలు నిర్వహించాలని అందులో పేర్కొన్నారు.  జ్వరం లేదా జలుబు వంటి లక్షణాలున్నట్టయితే తక్షణం ఐసోలేషన్‌కు తరలించాలని ఆదేశించారు. అలాగే, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను విధిగా పాటించాలని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు.