సరిహద్దుల రక్షణకు భారత్ కు రష్యా సహాయం.. అమెరికా అర్ధం చేసుకోవాలి  

సరిహద్దులను రక్షించుకోవడానికి రష్యా సహాయం కావాల్సిందేనని, ఈ విషయాన్నీ అమెరికా అర్ధం చేసుకోవాలని  ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.   ఆమె వాషింగ్టన్‌లో బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతదేశం ఉదారవాద ప్రపంచంతో బలమైన స్నేహితులుగా ఉండాలని కోరుకుంటుందని చెప్పారు. 

‘‘అమెరికాకు భారత్ మిత్ర దేశం. కానీ ఆ స్నేహితుడు బలహీనంగా ఉండకూడదు. బలహీన పడకూడదు’’ అని చెప్పడం ద్వారా భారత్ ను బలహీనపరిచే చర్యలకు దూరంగా ఉండాలన్న పరోక్ష సంకేతంను ఆమె అమెరికా ప్రభుత్వంకు పంపే ప్రయత్నం చేశారు.

ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన  నిర్మలా సీతారామన్ తిరిగొచ్చారు. అయితే.. అమెరికా వైఖరిని అర్థం చేసుకున్నట్టు మంత్రి చెప్పారు. ‘‘భారత్ ఎప్పుడూ స్నేహంగానే ఉండాలని అనుకుంటుంది. అమెరికా కూడా స్నేహితుడు కావాలని అనుకుంటే.. ఆ స్నేహితుడు బలహీన పడకూడదు. భౌగోళికంగా మేము ఉన్న చోట బలంగా నిలదొక్కుకోవాలి’’అని మంత్రి పేర్కొన్నారు. 

ఈయూతో పాశ్చాత్య దేశాల నుంచి భారత్‌ స్నేహం కొరుకుంటోందని, కానీ, సరిహద్దు అంశాల దృష్ట్యా రష్యా సహకారం అవసరమేనని ఆమె స్పష్టం చేశారు. భారత్ ఎదుర్కొంటున్న సరిహద్దు భద్రతా సవాళ్లను మంత్రి గుర్తు చేశారు. కరోనా మహమ్మారి సమయంలోనూ ఉత్తర సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు తలెత్తడాన్ని ప్రస్తావించారు.

పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్థాన్ తో నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆమె గుర్తు చేశారు. ఉక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయుధా, చమురు ఒప్పందాల విషయంలో రష్యాకు దూరంగా ఉండాలని ఐరోపా దేశాలు, అమెరికా చెప్తున్నా భారత్‌ వాణిజ్యాన్ని, ఒప్పందాల్ని కొనసాగిస్తోంది.

మరోవంక, ప్రస్తుత పరిస్థితులలో భారత్ రష్యాతో  తన సంబంధాలను యధావిధిగా కొనసాస్తూ ఉండడం పట్ల అమెరికా అసహనంతో ఉన్నట్లు మరోసారి రుజువయింది. భారత్‌ ర‌క్ష‌ణ అవ‌స‌రాలకు సంబంధించి ర‌ష్యాపై ఆధార‌ప‌డటాన్ని ఏమాత్రం తాము ప్రోత్సహించడంలేదని యూఎస్‌ రక్షణ కార్యాలయం పెంటగాన్‌ స్పష్టం చేసింది.

భారత్‌ రక్షణ అవసరాల విషయంలో రష్యాలపై అధికారపడటం మానుకోవాల‌ని హితవు చెప్పింది. భారత్‌తో పాటు ఇత‌ర దేశాలు కూడా ర‌క్ష‌ణ అవ‌స‌రాల కోసం ర‌ష్యాపై ఆధార‌ప‌డ‌డం ఆపేయాల‌ని భావిస్తున్నామ‌ని వెల్లడించింది. ఈ విషయంలో త‌మ‌కు ఎటువంటి ఉద్దేశంలేద‌ని అంటూనే ఆ అంశాన్నిఎట్టిపరిస్థితుల్లో ప్రోత్స‌హించ‌మ‌ని పెంట‌గాన్ ప్రెస్ సెక్ర‌ట‌రీ జాన్ కిర్బీ తెలిపారు.

భార‌త్‌తో ఉన్న ర‌క్ష‌ణ బంధానికి తాము విలువ ఇస్తామ‌ని అదేవిధంగా అమెరికా-ఇండియా మ‌ధ్య ఉన్న బంధం మ‌రింత బ‌లోపేతం కావ‌డానికి కృషి చేస్తామ‌ని పేర్కొన్నారు. ఉప‌ఖండంలో భ‌ద్ర‌త‌ను క‌ల్పించేది భార‌త్ అని ఆ విష‌యాన్ని తాము ఎల్లప్పుడు గుర్తిస్తామ‌ని తెలిపారు. 2018లో ట్రంప్ ప్రభుత్వం నిరాక‌రించినా భారత్‌ మాత్రం ర‌ష్యా నుంచి ఎస్‌-400 ట్రియంప్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైళ్ల‌ను కొనుగులుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎస్‌-400 మిస్సైళ్లు కొనుగోలు చేసిన ట‌ర్కీపైన అమెరికా నిషేధం విధించిన విషయం విదితమే.

నియంతలు, నియంతృత్వాల గురించి మాట్లాడుతూ భారత్‌ సమస్యలు భారత్‌కు వున్నాయని అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌ పేర్కొనడం గమనార్హం.  నియంతలే ఎక్కువగా భయపడతారంటూ భారత్‌ను కూడా ఆ గాటన కడుతూ  బైడెన్‌ వ్యాఖ్యలు చేశారు.