కోరిన వారం రోజుల్లో క్రెడిట్ కారులను మూసివేయాలి!

ఖాతాదారులు కోరిన వారం రోజులలో క్రెడిట్ కార్డులను మూసివేసి, ఆ విషయం బ్యాంకులు వారికి తెలపాలని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. అత్య‌ధిక విలువ గ‌ల క్రెడిట్ కార్డు స‌ర్వీస్ చార్జీలు కూడా ఎక్కువే. క్రెడిట్/ డెబిట్ యూజ‌ర్లు మోసాల‌కు గుర‌వుతుంటారు. 

ఈ మోసాలు, చార్జీల భారీ నుంచి ఖాతాదారుల‌ను ర‌క్షించ‌డానికి భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు సంసిద్ధ‌మైంది. అందుకు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. వ‌చ్చే జూలై ఒక‌టో తేదీ నుంచి ఈ మార్గ‌ద‌ర్శ‌కాలు అమ‌ల్లోకి వ‌స్తాయి. త‌త్ఫ‌లితంగా డెబిట్/ క్రెడిట్ కార్డుల వాడ‌కందారుల‌కు ర‌క్ష‌ణ‌తోపాటు సేవ‌ల్లో పార‌ద‌ర్శ‌క‌త పెరుగుతుంద‌ని ఆర్బీఐ పేర్కొంది. 

తాజా మార్గ‌ద‌ర్శ‌కాలు 

* ఎవ‌రైనా ఖాతాదారుడు త‌న క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తే సంబంధిత బ్యాంకు యాజ‌మాన్యం దాన్ని వారంలో ప‌రిష్క‌రించాలి.

* క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసిన అంశంపై ఖాతాదారుడికి వెంట‌నే మెసేజ్‌, ఈ-మెయిల్ ద్వారా స‌మాచారం ఇవ్వాలి.

* క్రెడిట్ కార్డు వాడ‌కం దారుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక ఈ-మెయిల్ ఐడీ క్రియేట్ చేయాలి.

* ఐవీఆర్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవాలి.

* ప్ర‌తి బ్యాంకు త‌మకు వ‌చ్చిన ఫిర్యాదుల వివ‌రాలు సొంత వెబ్‌సైట్‌తోపాటు ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌లో ప్ర‌త్యేకంగా క‌నిపించేలా చూడాలి.

* క్రెడిట్ కార్డుల‌ను మూసివేయాల‌ని వ‌చ్చే విజ్ఞ‌ప్తులను స్వీక‌రించ‌డానికి స‌ర‌ళీకృత విధానాన్ని అమ‌లు చేయాలి.

* క్రెడిట్ కార్డు ర‌ద్దు చేయాల‌ని పోస్ట్‌, ఇత‌ర మీడియా వేదిక‌ల ద్వారా నిబంధ‌న విధించ‌రాదు.

* ఏడాది కంటే ఎక్కువ కాలం క్రెడిట్ కార్డు వాడ‌ని ప‌క్షంలో సంబంధిత యూజ‌ర్‌కు స‌మాచారం ఇచ్చి ఆ క్రెడిట్ కార్డు ఖాతా మూసివేత ప్ర‌క్రియ మొద‌లు పెట్టాలి.

* నెల రోజుల్లో కార్డు య‌జ‌మాని నుంచి వ‌చ్చే జ‌వాబును బ‌ట్టి దాని మూసివేత‌కు చ‌ర్య‌లు తీసుకోవాలి. దానిపై బ‌కాయిలు ఉన్నాయా? లేదా? అన్న సంగ‌తి చెక్ చేసుకోవాలి.

* నెల గ‌డువులోపు క్రెడిట్ సమాచారం  సంస్థ‌తో కార్డు మూసివేత రికార్డును అప్‌డేట్ చేయాలి.

* క్రెడిట్ కార్డు ఖాతాను మూసేశాక‌.. ఆ ఖాతాలో ఉన్న న‌గ‌దును య‌జ‌మాని బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫ‌ర్‌చేయాలి.

* క్రెడిట్ కార్డు చార్జీల్లో మార్పులుంటే నెల రోజుల ముందే యూజ‌ర్‌కు తెలియ‌జేయాలి

*కార్డు యాక్టివేట్ కాక‌ముందే సిబిల్, ఎక్స్‌పీరియ‌న్స్ వంటి క్రెడిట్ బ్యూరో సంస్థ‌ల‌కు స‌మాచారం ఇవ్వొద్దు.

* క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే ఈఎంఐ (నెల‌స‌రి వాయిదా) విష‌యంలో పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించాలి.

డెబిట్ కార్డులు ఎవ‌రికివ్వాలంటే..

సేవింగ్స్‌, క‌రంట్ ఖాతాలు గల ఖాతాదారుల‌కు మాత్ర‌మే డెబిట్ కార్డులు ఇవ్వాలి.

* రుణ అకౌంట్‌లు గ‌ల ఖాతాదారుల‌కు డెబిట్ కార్డులు జారీ చేయ‌రాదు.

* డెబిట్ కార్డు తీసుకోవాల‌ని ఖాతాదారుడిపై ఒత్తిడి తేవొద్దు.

* డెబిట్ కార్డు తీసుకుంటేనే ఇత‌ర వ‌స‌తులు ఉంటాయ‌ని ష‌ర‌తులు వ‌ర్తింప చేయొద్దు.