మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని కోరిన భారత్ 

ఆర్థిక నేరాలకు పాల్పడి భారత్ నుంచి పారిపోయి, బ్రిటన్‌లో ఉంటున్నవారిని తిరిగి తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ను భారత ప్రభుత్వం కోరింది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా ఆర్థిక నేరగాళ్ళను తిరిగి అప్పగించాలని చేసిన విజ్ఞప్తిని జాన్సన్ దృష్టిలో ఉంచుకున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా తెలిపారు. 
 
భారత్-  బ్రిటన్ ప్రధాన మంత్రులు నరేంద్ర మోదీ, బోరిస్ జాన్సన్ చర్చల అనంతరం శృంగ్లా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా భారత్‌కు చెందిన ఆర్థిక నేరగాళ్ళను తిరిగి తమకు అప్పటించాలని కోరామని, ఈ విషయాన్ని జాన్సన్ దృష్టిలో ఉంచుకున్నారని చెప్పారు.
ఆర్థిక నేరగాళ్ళ విషయాన్ని తాము బ్రిటన్‌లో వివిధ స్థాయుల్లో లేవనెత్తుతున్నామని చెప్పారు. మన దేశంలో చట్టపరమైన చర్యలను, విచారణను ఎదుర్కొనవలసి ఉన్న ఆర్థిక నేరగాళ్ళను తిరిగి స్వదేశానికి రప్పించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
కాగా, భారత దేశం నుంచి పారిపోయి బ్రిటన్‌లో ఉంటున్న ఆర్థిక నేరగాళ్ళను తిరిగి స్వదేశానికి అప్పగించడం గురించి బోరిస్ జూన్సన్ ప్రధాని మోదీతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చట్టపరమైన సాంకేతిక అంశాలు ఇమిడియున్నందువల్ల వీరిని తిరిగి అప్పగించడం సంక్లిష్టమవుతోందని తెలిపారు.
వారిని తిరిగి పంపిచేయాలని బ్రిటన్ ప్రభుత్వం ఆదేశించిందని చెబుతూ  భారత దేశంలోని చట్టాన్ని తప్పించుకోవడం కోసం బ్రిటన్‌లోని న్యాయ వ్యవస్థను ఉపయోగించుకోవాలనుకునేవారిని తాము స్వాగతించబోమని స్పష్టం చేశారు.
 
విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వేల కోట్ల రూపాయల మేరకు బ్యాంకులను మోసగించినట్లు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. నీరవ్ మోదీ, ఆయన భార్య అమి 2018లో దేశం విడిచి వెళ్లిపోయారు. ఆయన ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నారు. ఆయనను భారత్‌కు అప్పగించాలన్న కోర్టు ఆదేశాలపై అపీలు చేశారు. 
 
మాల్యా 2016 నుంచి లండన్‌లోనే ఉంటున్నారు. బ్యాంకులను మోసగించినట్లు, మనీలాండరింగ్ నేరాలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు నమోదయ్యాయి. ఆయనను భారత్‌కు అప్పగించాలనే ఆదేశాలపై బ్రిటన్ హోం శాఖ కార్యదర్శి సాజిద్ జావిద్ 2019లో సంతకం చేశారు.