రష్యా గుప్పిట్లోకి ఉక్రెయిన్ ప్రధాన నగరం మరియుపోల్

రష్యా గుప్పిట్లోకి ఉక్రెయిన్ ప్రధాన నగరం మరియుపోల్

ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాల్లో ఒకటైన మరియుపోల్ ను రష్యా వశం చేసుకుంది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ ప్రకటన చేశారు. మరియుపోల్ను తమ సేనలు పూర్తిస్థాయిలో అధీనంలోకి తెచ్చుకున్నాయని పుతిన్ తెలిపారు. ఆ ప్రాంతానికి విజయవంతంగా విముక్తి లభించిందని పేర్కొన్నారు. 

అలాగే అక్కడి అజయ్స్తల్ స్టీల్ ప్లాంట్ పై దాడి చేయడానికి బదులుగా, దాన్ని ముట్టడించాలని తమ సైన్యాన్ని ఆదేశించారు. తద్వారా ప్లాంట్ లో ఉన్నవారు ఎక్కడికీ పారిపోవడానికి అవకాశం ఉండదని పుతిన్ సూచించారు.

అజయ్స్తల్ స్టీల్ ప్లాంట్లో ఉన్న ఉక్రెయిన్ సైనికులు వెంటనే లొంగిపోవాలని హెచ్చరించారు. వారికి ఎలాంటి హాని తలపెట్టమని, వైద్య సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అక్కడ చిక్కుకుపోయిన సామాన్య ప్రజలను తరలించేందుకు కొన్ని బస్సులను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. 

కాగా, స్టీల్ ప్లాంట్ లో సుమారు 2 వేల మంది ఉక్రెయిన్ సైనికులు ఉన్నట్లు సమాచారం. ఇకపోతే, మరియుపోల్ విమోచన కోసం పోరాడిన తమ సైనికులను పుతిన్ మెచ్చుకున్నారు. ఇకపై అక్కడి పారిశ్రామిక ప్రాంతంపై దాడి చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

అంతకుముందు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగు మాట్లాడుతూ, అజొవ్‌స్టల్ స్టీల్ ప్లాంట్‌తోపాటు మరియుపోల్ నగరం రష్యా నియంత్రణలో ఉందని తెలిపింది. ఈ పారిశ్రామిక వాడను దిగ్బంధనం చేయాలని, కనీసం ఈగ అయినా బయటికి వెళ్ళకుండా చూడాలని పుతిన్ ఆదేశించారు.

ఈ స్టీల్‌ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకోకపోతే మరియుపోల్‌ తమ నియంత్రణలో ఉందని చెప్పడం రష్యాకు సాధ్యం కాదు. దీనికి వ్యూహాత్మక ప్రాధాన్యం చాలా ఉంది. ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైనప్పటి నుంచి మరియుపోల్ నగరం అనేక నష్టాలను చవి చూసింది.