సంజయ్ పాదయాత్రను `టీఆర్ఎస్’ అడ్డుకొనే యత్నం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతున్న సంజయ్‌ పాదయాత్ర ఐదో రోజైన సోమవారం ఇటిక్యాల మండలం వేముల గ్రామం నుంచి ఉదండాపూర్‌ వరకు 13 కి.మీ మేర సాగింది. 

ఉదయం వేముల నుంచి యాత్ర ప్రారంభం కాగా.. గ్రామం దాటిన తర్వాత టీఆర్‌ఎస్‌ శ్రేణులు రెండుసార్లు అడ్డు తగిలే ప్రయత్నం చేశాయి. మొదట అడ్డుకున్న చోట టీఆర్‌ఎస్‌ విద్యార్థి నేతలను పోలీసులు చెదరగొట్టగా, బీజేపీ కార్యకర్తలను డీకే అరుణ సముదాయించారు. కిలోమీటరు దూరం వెళ్లాక కొందరు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు యాత్రకు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు.

 దీంతో మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలకు గాయాలయ్యాయి. బీజేపీ నేతలకు చెందిన ఆరు కార్లు ధ్వంసమయ్యాయి. బీజేపీ నాయకుల ఫ్లెక్సీలకు టీఆర్‌ఎస్‌ వారు నిప్పంటించారు. దీనిపై ఇరు పార్టీల వారు పోలీసు  స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

పాదయాత్రను అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు పక్క మండలమైన అయిజ నుంచి వచ్చారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఆదివారం పాదయాత్రలో అలంపూర్‌ ఎమ్మెల్యే, ఆయన కుమారుడిపై విమర్శలు చేసినందుకే ఈ దాడి చేయించారని చెబుతున్నారు. ఇక, ఎన్ని అడ్డంకులు సృష్టించినా బరాబర్‌ పాదయాత్ర కొనసాగిస్తానని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. 

తమను బెదిరిస్తే మరింత గట్టిగా కొట్లాడతామని హెచ్చరించారు. ఆరు నెలల్లో కేసీఆర్‌ ఖేల్‌ ఖతం కాబోతోందని స్పష్టం చేశారు. పాదయాత్రపై జరిగిన దాడికి సీఎం కేసీఆర్‌దే బాధ్యత అని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రోద్బలంతో, మంత్రి కేటీఆర్‌ డైరెక్షన్‌లో పథకం ప్రకారం ప్రజా సంగ్రామ యాత్రపై దాడులు చేస్తున్నారని బీజేఎల్పీ నేత రాజాసింగ్‌, ఎంపీ సోయం బాపురావు తదితరులు ఆరోపించారు. పాదయాత్రపై దాడి టీఆర్‌ఎస్‌ అరాచక పాలనకు నిదర్శనమని మాజీ ఎంపీ విజయ శాంతి మండిపడ్డారు.

ఈ విషయం తెలియగానే, బండి సంజయ్‌కు ఆ పార్టీ రాష్ట్ర వ్యహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ సోమవారం ఫోన్ చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు  ‘ప్రజా సంగ్రామ యాత్ర’పై దాడి చేయడంపై ఆరా తీశారు. అధికార టీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రను అడ్డుకున్న విషయం తెలిపారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి చేశారని చెప్పారు. జాతీయ నాయకత్వం అండగా ఉంటోందని పేర్కొంటూ ధైర్యంగా ముందుకెళ్లమని సంజయ్‌కు తరుణ్ చుగ్ భరోసా ఇచ్చారు. 

బండి సంజయ్ చేస్తున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’పై దాడి చేయడం టీఆర్ఎస్ అరాచక పాలనకు నిదర్శనమని బీజేపీ నేత  సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి  ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అరాచకాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయని ఆమె  మండిపడ్డారు. 

50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు గుంపులు గుంపులుగా వచ్చి ప్రజా సంగ్రామ  పాదయాత్రపై, బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడం సిగ్గుచేటని ఆమె దయ్యబట్టారు. ఇంత జరుగుతున్నా పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ వారికి రక్షణగా నిలబడడం అత్యంత దారుణమని విజయశాంతి ధ్వజమెత్తారు. 

టీఆర్ఎస్ నియంత పాలనకు వ్యతిరేకంగానే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని చెబుతూ, పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి టీఆర్ఎస్ దాడులు చేస్తోందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ  ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల్లో బీజేపీ కార్యకర్తలకు చెందిన ఐదు కార్లు ధ్వంసం అయ్యాయని ఆమె పేర్కొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రను అడ్డుకుంటారని పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నా సరిగ్గా స్పందించడం లేదని ఆమె ఆరోపించారు.

అంతకుముందు అలంపూర్ నియోజకవర్గంలోని వేముల గ్రామంలో బండి సంజయ్ మాట్లాడుతూ కాళేశ్వరం నీళ్లను ఫాంహౌస్ కు తరలించేందుకు కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలకు నీళ్లు ఎందుకు ఇవ్వటం లేదే కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.  

రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారని  సంజయ్ ధ్వజమెత్తారు. నకలీ విత్తనాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవటం లేదని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ విస్మరించారన్నారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి  డీకే అరుణ దుయ్యబట్టారు. ఆర్డీఎస్ ద్వారా జిల్లాకు నీళ్లు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. 

కేసీఆర్, కేటీఆర్ డైరెక్షన్ లోనే దాడి 

ఇలా ఉండగా, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ డైరెక్షన్ ప్రకారమే ‘ప్రజా సంగ్రామ యాత్ర’పై దాడులు చేస్తున్నారని బిజెపి ఎమ్యెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని, దాడులు చేస్తారని ముందే సంజయ్ చెప్పారని గుర్తు చేశారు. 
 
 అయినా,సంజయ్ పై దాడిని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.  బీజేపీ కార్యకర్తలు సంయమనంతో ఉండాలని ఆయన కోరారు. ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ బండి సంజయ్‌  ప్రజలకు భరోసా కలిగిస్తున్నారని చెబుతూ  టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించాల్సింది పోయి ఇలాంటి దాడులు చేయడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ దాడులు కేసీఆర్ రాజకీయ దివాళా కోరుతనానికి నిదర్శనమని పేర్కొంటూ అన్నిరంగాల్లో విఫలమైన ముఖ్యమంత్రి ప్రజాగ్రహాన్ని ఎదుర్కోలేక తమ కిరాయి గూండాలతో దాడి చేయించడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి రక్షణ కల్పించలేని వాళ్లు సామాన్య ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు.