ప్రోటోకాల్ విషయంలో కేంద్రమే నిర్ణయం తీసుకొంటుంది 

తెలంగాణ ప్రభుత్వం తన విషయంలో ప్రోటోకాల్ పాటించని విషయమై కేంద్రంకు ఓ నివేదిక ఇచ్చానని,  ఈ విషయంలో కేంద్రమే ఓ  నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర గవర్నర్ డా. తమిళసై సౌందర రాజన్ తెలిపారు. అయినా తాను ప్రజా సేవ తప్ప ప్రోటోకాల్ పట్టించుకోనని ఆమె స్పష్టం చేశారు. 

ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఆమె ఏడాదిగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తున్నానని చెప్పారు. ప్రతి నెలా ఓ గవర్నర్ గా కేంద్రానికి నివేదిక  ఇవ్వాల్సి ఉంటుందని, అందుకోసమే తాను ఢిల్లీకి వచ్చినట్లు ఆమె తెలిపారు. కొంతమంది వ్యక్తులు తాను రాజకీయాలు చేస్తున్నానంటూ అనవసర వ్యాఖ్యలు  చేస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. 

ఓ గవర్నర్ గా తన విధులు నిర్వహిస్తున్నానని పేర్కొన్న గవర్నర్  తనకు ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని తేల్చి చెప్పారు. ఏది ఏమైనా ప్రజల కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటానని ఆమె చెప్పారు. కాగా, తాను  తాను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని ఎక్కడా అనలేదని స్పష్టం చేస్తూ, ఈ విషయమై తప్పుగా వక్రీకరిస్తున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు. 

‘‘ఇతర రాష్ట్రాల్లో గవర్నర్‌తో విభేదించినా, రాజ్‌భవన్‌ను గౌరవిస్తున్నారు. నేను గవర్నర్‌గా మాత్రమే పనిచేస్తున్నా. నాకు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయం చేస్తున్నానని అనవసరంగా విమర్శిస్తున్నారు. ఆధారాలు లేకుండా విమర్శలా..? మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా విమర్శిస్తున్నారు. పాత వీడియోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు” అంటూ ఆమె వివరణ ఇచ్చారు. 

“నేను ప్రజల సమస్యలను పరిష్కరించటం తప్పా? ప్రజలను కలిస్తే తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. ఏ పదవిలో ఉన్నా, ప్రజలకు సేవ చేయుటం నా లక్ష్యం. ప్రొటోకాల్ ఉల్లంఘనపై కేంద్రం తన పని తాను చేసుకుపోతోంది. గిరిజనుల మంచి కోసం వాళ్ల ప్రాంతాల్లో పర్యటిస్తున్నా. ఆహ్వానాలను రాజకీయంగా చూడొద్దు’’  అని గవర్నర్ తమిళిసై హితవు చెప్పారు. 

ధాన్యం కొనుగోలు అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని  కోరుతూ కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన లేఖను సంబంధిత వర్గాలకు పంపించానని ఆమె చెప్పారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాలని ఆమె సూచించారు. మహిళలు ఎట్టిపరిస్థితుల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ధైర్యంగా ముందుకెళ్లాలని ఆమె చెప్పారు.