మంత్రి పువ్వాడపై హత్యకేసు నమోదు చేయాలి 

పోలీసుల వేధింపులతో పురుగుల మందు తాగి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బీజేపీ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు సాయి గణేష్ మృతికి సంబంధించి మంత్రి పువ్వాడ, బాధ్యులైన పోలీసులు, నాయకులపై హత్య కేసు నమోదు చేయాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ఖమ్మంలో సాయి గణేష్ ఆత్మహత్య ఘటనలో న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అమాయకులు ఆత్మహత్య చేసుకునేలా టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు.  జోగులాంబ గద్వాల జిల్లాలో 4 వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ కొనసాగుతుండగా, చండూరు పాదయాత్ర శిబిరం దగ్గర బీజేపీ కార్యకర్త సాయి గణేష్ చిత్రపటానికి నివాళులర్పించారు.
 
మరణ వాంగ్మూలం తీసుకుంటే స్థానిక మంత్రి, టీఆర్ఎస్ నేతలపై హత్య కేసు నమోదు చేయాల్సి వస్తుందనే భయంతోనే మరణ వాంగ్మూలం నమోదు చేయలేదని ధ్వజమెత్తారు. సీఎంఓ నుండి వచ్చిన ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే మంత్రి, పోలీసులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. 
 
పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉందని, త్వరలోనే ప్రజలు చరమగీతం పడతారని దుయ్యబట్టారు. సాయి గణేష్ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు జరగకుండా బీజేపీ పార్టీ కార్యచరణ రూపొందించి కార్యకర్తలకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
 
‘ఖమ్మం లోని స్థానిక మంత్రి చేసిన అవినీతి అడ్డుకొని ధర్మం కోసం నిబద్ధతతో పని చేసిన సాయిని వేధించి అక్రమ కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకుని విధంగా చేశారు. కండ కవరం తలకెక్కి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న మీరు మనుషులు కాదు మానవ మృగాలు. బీజేపీని ఎదుర్కొలేక కార్యకర్తలను పోలీసుల చేత భయపెడుతున్నారు.. అలాంటి కొమ్ము కాసే పోలీసులను వదిలిపెట్టం’ అని హెచ్చరించారు.
 
బిజెపి కార్యకర్తల, యువకుల శోకానికి ఫలితం అనుభవించక తప్పదని సంజయ్ హెచ్చరించారు. బిజెపి అధికారంలోకి వచ్చాక బాధ్యులను వదిలిపెట్టబోమని, ఖచ్చితంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.  
 
‘రాష్ట్రంలో కొత్త తరహా రాజకీయాలకు టీఆర్‌ఎస్‌ తెర లేపింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రశ్నించే వారిని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోంది. మంత్రి అవినీతి, అక్రమాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఖమ్మం జిల్లా బీజేపీ కార్యకర్త సాయిగణేశ్‌పై 15 అక్రమ కేసులు పెట్టింది. అతను భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అదే విధంగా, మెదక్‌ జిల్లా రామాయంపేటకు చెందిన సంతోష్, అతని తల్లి స్థానిక మున్సిపల్‌ చైర్మన్‌ వేధింపులు భరించలేక చనిపోతున్నట్లు వీడియో పెట్టారని, లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. ఈ చావులకు ముమ్మాటికీ సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలదే బాధ్యత అని స్పష్టం చేశారు.
బీజేపీ మజ్జూరు సంఘం జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్న సాయి గణేష్‌  ఖమ్మం జిల్లా కేంద్రంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేపీ పార్టీ జెండా గద్దె కట్టేందుకు ప్రయత్నించగా దాన్ని కూల్చేశారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు వేధిస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి బయపెడుతున్నారని ఆరోపిస్తూ ఆత్మాహత్యాయత్నం చేశాడు.

దీంతో పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆ యువకుడు మరణించాడు. కాగా పోలీస్ స్టేషన్‌కు సంబంధం లేదనీ, బయటనే పురుగుల మందు సేవించాడని పోలీసులు చెబుతున్నారు. అయితే సీసటీవీ ఫుటేజ్‌ బయట పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం, మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కార్యాలయాలన్ని ముట్టడి చేసి మంత్రి అజయ్ కుమార్ రాజీనామా చేసేంతవరకు ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.

పువ్వాడ అజయ్ ఓవర్ యాక్షన్ … జగ్గారెడ్డి ధ్వజం 
 

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పోలీసుల వేధింపులు భరించలేక ఖమ్మంలో బిజెపి కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల కాంగ్రెస్ ఎమ్యెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పువ్వాడను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రిపై ఉన్న ఫిర్యాదులపై విచారణ జరిపించాలని కోరారు. 

బాధితుని వాంగ్మూలం తీసుకొని ఎమ్మారో, ఆర్డీఓ, సీఐ, డీఎస్పీని సస్పెండ్ చేయాలని జగ్గారెడ్డి సూచించారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై పీడీ యాక్టు కేసులు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.  మంత్రి పువ్వాడ ఓ సైకో అని మండిపడుతూ, ఖమ్మం జిల్లాలో మూడేళ్ల నుంచి మంత్రి పువ్వాడ అజయ్, పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని జగ్గారెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు.

కేసీఆర్, కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేయడానికి పువ్వాడ అజయ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్న జగ్గారెడ్డి ఆయనకు కొందరు పోలీసులు చెంచాగిరి చేస్తున్నారని విమర్శించారు. పువ్వాడపై చర్యలు తీసుకోవడంలో కేసీఆర్ ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే నష్టమని జగ్గారెడ్డి కేసీఆర్ ప్రభుత్వంను హెచ్చరించారు. పోలీసులపై విశ్వాసం పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు.